అప్పుడెప్పుడో నాగార్జున - వర్మ కాంబినేషన్లో వచ్చిన 'శివ' సినిమా ట్రెండ్ సెట్టర్ అయితే కావచ్చు గాక. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్మ ఏ సినిమా చేసినా, వివాదాలు తప్ప, సక్సెస్లుండట్లేదు. నాగార్జున ఒకింత తన వయసుకు తగ్గట్లుగా స్టోరీలు ఎంచుకుంటూ సక్సెస్‌లో తన కొడుకులతో పాటు, మిగిలిన కొంతమంది యంగ్ హీరోలకు కూడా పోటీగానే నిలుస్తున్నాడు.
ఇలాంటి తరుణంలో వర్మతో 'ఆఫీసర్' సినిమా ఒప్పుకుని తప్పు చేశాడేమో అనుకున్నారంతా. యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా 'ఆఫీసర్' తెరకెక్కించామని, ఫస్ట్ విడుదల చేసిన టీజర్స్‌తో వర్మ ప్రూవ్ చేసుకున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ అయినా కానీ అందులో ఏమంత కొత్తదనం కనిపించలేదే అని ఆడియన్స్ పెదవి విరిచేశారు కూడా. అయినా కానీ నాగ్ - వర్మ ఏమాత్రం తగ్గలేదు. ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఈ సినిమాపై. తండ్రీ కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ తరహా పాత్రలో నాగ్ కనిపించి చాలా కాలమే అయ్యింది. ఇంతవరకూ ఆఫీసర్ అంటే పవర్ఫుల్ పోలీసాఫీసర్, పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంతే.. అయితే ముచ్చటగా మూడోసారి విడుదల చేసిన సాంగ్ ప్రోమోతో ఆఫీసర్లోని మరో యాంగిల్‌ని చూపించి, టచ్ చేశాడు వర్మ. ఇదే టచ్‌తో వర్మ - నాగ్ 'ఆఫీసర్' సక్సెస్‌ని బీట్ చేస్తుందేమో చూడాలిక. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా జూన్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది.