వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా కానీ పరిగణలోనికి తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
'మనం' సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. అలాగే నాని హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా గురించీ ఇలాంటి మాటే వినిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్, ఎట్రాక్ట్ చేసింది. అంతేకాదు నాని నటన, విజయ్ దేవరకొండ నటనకు తగిన గుర్తింపు దక్కి ఉంటే బావుండేది. ఇదే సోషల్ మీడియాలోనూ, సినీ పరిశ్రమలోనూ చర్చించుకుంటున్నారు. అలాగే హిస్టారికల్ మూవీ అయిన 'కంచె' గురించి కూడా ఇదే ప్రస్థావన. ఆ సినిమాలో ఎవరికి వారే పాత్రల పరంగా ప్రాణం పెట్టేశారు. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సీత పాత్రలో ప్రగ్యా జైశ్వాల్ అయినా, వరుణ్ తేజ్ పాత్ర అయినా చాలా నేచురల్‌గా సజీవంగా అనిపిస్తాయి. మరో సినిమా 'ఊపిరి'. ఈ సినిమాలో కార్తి నటనను మెచ్చుకోని వారు, ప్రశంసించని వారు ఎవరైనా ఉంటారా? ఓ తమిళ హీరో తొలిసారిగా తెలుగులో చేసిన డైరెక్ట్ మూవీ ఇది. సొంత డబ్బింగ్, నేచురల్ యాక్టింగ్..ఇలా అసలు సిసలు గుర్తింపు దక్కాల్సిన పాత్ర ఇది.
ఇలా పలు సినిమాలు అర్హత కలిగీ అవార్డును అందుకోలేకపోయాయి. ఈ సినిమాకి ఏం తక్కువ, ఆ సినిమాకి ఏం ఎక్కువ అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే అవార్డులు అన్ని సినిమాలకూ ఇవ్వలేరు కదా. కొన్ని కొన్ని ఈక్వేషన్స్, కొంతవరకే పరిమితమై ఉంటాయి. అలా అవార్డు దక్కించుకున్న సినిమాలు ఆనందంలో ఉంటే, అర్హత కలిగీ అవార్డు దక్కని సినిమాలు అసంతృప్తిలో ఉన్నాయి. ఇదీ ఈ మూడేళ్ల నంది అవార్డుల సంగతి.