పవన్ కళ్యాణ్ 2009లోనే రాజకీయాల్లోకి వచ్చారు. అది అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భం. ఆ తర్వాత రాజకీయాల నుంచి కొంత గ్యాప్ తీసుకుని, ఈసారి సొంత కుంపటి 'జనసేన'తో జనం ముందుకు వచ్చారు. జనసేనాధిపతిగా కూడా దాదాపు నాలుగేళ్ళు పూర్తి చేసుకుంటున్న పవన్‌కళ్యాణ్, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలే చేశారు. కానీ ఇకపై సినిమాలు చేయనంటున్నారు.
ప్రస్తుతానికైతే రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నట్లు స్పష్టంగా చెప్పేసిన పవన్, సినిమాలకు సమయం ఉండబోదని క్లారిటీ ఇచ్చేసరికి ఆయన అభిమానులు కొంత డీలాపడ్డారు. చిరంజీవి తర్వాత మెగా కాంపౌండ్‌లో అంతటి సినీ ఫాలోయింగ్ ఉన్నది పవన్‌కళ్యాణ్‌కే. ఓవర్సీస్‌లో నెంబర్ వన్ హీరోగా పవన్‌కళ్యాణ్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. వరుసగా రెండు ఫెయిల్యూర్స్ తర్వాత కూడా 'అజ్ఞాతవాసి' సినిమాకి 150 కోట్ల బిజినెస్ ఓవరాల్‌గా జరిగిందంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్‌కళ్యాణ్, సినిమాలు మానేసుకోవాలన్న ఆలోచన చేయడాన్ని సినీ పరిశ్రమలో ఎవరూ సమర్థించడంలేదు.
ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేయాలనే యావ లేదని పవన్ చెబుతుండడంతో, సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో కొనసాగడం మంచిదని ఆయనకు పలువురు సూచిస్తున్నారు. నెలకోసారి ఓ పది రోజులు పూర్తిగా జనసేనకు కేటాయించినా, ఇంకో పది రోజులు సినిమాకి, మరో పది రోజులు వ్యక్తిగత జీవితానికి కేటాయిస్తే సరిపోతుంది. కానీ పవన్‌కళ్యాణ్ ఆలోచనేమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. 'నేను సినిమాల్ని వదిలేసుకుని, రాజకీయాల్లోకి వెళ్ళాను. నా తమ్ముడు పవన్ అలా చేయకూడదు. పవన్ సామర్థ్యం నాకు తెలుసు. సినిమాల్నీ, రాజకీయాల్ని ఒకేకాలంలో డీల్ చేయగలడు' అని తమ్ముడు పవన్‌కళ్యాణ్ మీద, అన్నయ్య చిరంజీవి చాలా నమ్మకంతో కొన్నాళ్ళ క్రితం పవన్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు.
కానీ పవన్, సినిమాలు మానేసి రాజకీయాలపై దృష్టిపెట్టాలనుకోవడం వెనుక మర్మమేమిటో!