మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి మెగా మల్టీ స్టారర్‌ని తెరకెక్కించనున్నారన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఇలా ఉండబోతోంది. అలా ఉండబోతోంది. చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ పలానా అట అంటూ రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంకా కథ సిద్ధం కాలేదనీ తాజాగా తెలియవస్తోంది.
మార్చి 30న చరణ్ 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నిమిత్తం 'రంగస్థలం' ప్రమోషన్స్‌లో రాజమౌళి మల్టీస్టారర్ గురించి ఆడగ్గా, ఇంకా రాజమౌళి తనకు కథని వినిపించలేదనే సమాధానం ఇచ్చాడు. అలాగే తాజాగా ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ని కూడా ఇదే ప్రశ్న ఆడగ్గా, తను కూడా ఇదే సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే వీరిద్దరికీ ఇంకా కథ గురించి తెలియదనీ అర్ధమవుతోంది. మల్టీస్టారర్ తెరకెక్కడం అయితే పక్కా. కానీ కథే ఇంకా సిద్ధం కాలేదట. రాజమౌళి ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడనీ తెలుస్తోంది.
ఈ లోగా చరణ్, ఎన్టీఆర్‌లు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసుకొని, తన సినిమా కోసం సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పాడట. చరణ్ - బోయపాటితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. పూజా హెగ్దే ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో జత కడుతోంది. వీలైనంత త్వరగా వీరిద్దరూ ఈ రెండు సినిమాలూ పూర్తి చేసుకుని, మల్టీ స్టారర్‌లో నటించేందుకు రెడీ అవ్వాలనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.