తెలుగులో 'మహానటి' సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. 30 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది వసూళ్ల పరంగా. ఇది ఎవరూ ఊహించనిది. చిత్ర యూనిట్ అసలు ఊహించనిదీ విజయం. అయితే లేటెస్టుగా ఈ సినిమా తమిళనాడులో విడుదలైంది. అక్కడ 'మహానటి' విడుదలైన నాటి నుండీ వ్యతిరేకత ఎక్కువగా ఏర్పడుతోంది.
అందుకు కారణం జెమినీ గణేశన్ పాత్రను నెగిటివ్‌గా చూపించడమే. ఈ సినిమా పట్ల తమిళనాడులో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెమినీ గణేశన్ గురించి సినిమాలో చూపించిందంతా తప్పేనని వారు ఆరోపిస్తున్నారు. సావిత్రి జెమినీ గణేశన్ భార్య అన్న మాట నిజమే కానీ, సావిత్రితో జెమినీ గణేశన్‌కి ఫస్ట్ లవ్ అన్న మాట ఎంతమాత్రమూ వాస్తవం కాదంటున్నారు. సావిత్రితో ఆయనకు పరిచయం ఏర్పడే నాటికే ఆయనకు వివాహమైంది. భార్య, పిల్లలున్నారు. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి ఆయన్ని ఈ సినిమాలో పూర్తి విలన్‌గా చూపించడాన్ని తమిళ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దాంతో 'మహానటి' సినిమాని అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే జెమినీ గణేశన్ మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ కూడా తన తండ్రి విలన్ కాదంటూ, సావిత్రికే తన తండ్రి అంటే ఇష్టం లేదనీ, ఆయన పాత్రను ఇంత దారుణంగా చూపిస్తారా అంటూ మీడియాకెక్కిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ వసూళ్ల హవా కొనసాగించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోన్న 'మహానటి'కి తమిళనాట ఇలా కొంత వ్యతిరేకత ఏర్పడడం ఒకింత ఆలోచించాల్సిన అంశమే.