దాదాపు 15 ఏళ్ళ క్రితం, హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్టార్ డం తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. అయితే ఆ తరువాతి కాలంలో అపజయాలు ఎదురవడంతో నిరాశ, తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకి పాల్పడ్డాడు.
ఇక ఇప్పుడు ఆయన జీవితం పైన ఒక బయోపిక్ రాబోతున్నది అంటూ నిన్నటి నుండి ఫిలిం నగర్ లో హల్చల్ మొదలైంది. ఈ తరుణంలో ఆ బయోపిక్ కి ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ అలాగే ఈ చిత్రానికి “కాబోయే అల్లుడు” అని కూడా పెట్టినట్టుగా కొత్త వార్తలు సంచరించడం మొదలైంది.
అయితే ఇవన్ని ఒట్టి పుకార్లు మాత్రమేనని, ఇందులో ఎటువంటి నిజం లేదు అని అంటున్న వారు కూడా లేకపోలేదు. మహానటి చిత్రంతో తెలుగు నాట బయోపిక్స్ కి మంచి మార్కెట్ ఏర్పడింది, అందుకే ఇప్పుడు ఉదయ కిరణ్ బయోపిక్ తెరపైకి వచ్చినట్టుగా చెబుతున్నారు.
ఏదేమైనా... ఉదయ కిరణ్ బయోపిక్ అంటే కచ్చితంగా అది సంచలనాలకి కేంద్ర బిందువుగా అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.