సినిమా అంటేనే ఓ మ్యాజిక్. ఓ సినిమా ఎందుకు అనూహ్య విజయం సాధిస్తుందో, ఓ సినిమా ఎందుకు అనూహ్య పరాజయం సాధిస్తుందో ఒక్కోసారి అర్థం కాని పరిస్థితి. హిట్టయ్యే లక్షణాలున్న సినిమా ఫ్లాపవడం, ఫ్లాపయ్యే లక్షణాలున్న సినిమా సూపర్ హిట్ అవడం చూస్తూనే వున్నాం.
ఒకప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒక్క సినిమాతో స్టార్‌డమ్ తల్లకిందులైపోతుంది. వరుస విజయాలతో జోరు మీద కన్పించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు డీలాపడిపోయాడు. అనూహ్యంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, 'నోటా'తో బొక్క బోర్లా పడ్డాడు. 'ఆటిట్యూడ్..' అంటూ విజయ్ దేవరకొండ, ఒకింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడుగానీ, సినీ పరిశ్రమలో విజయమే.. ఎవరి ఇమేజ్‌ని అయినా డిసైడ్ చేస్తుంది.
తరుణ్ ఒకప్పుడు 'నువ్వే కావాలి' సినిమాతో సాధించిన విజయం, ఆ తర్వాత అతనికి దక్కిన స్టార్‌డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉదయ్‌కిరణ్ సంగతి సరే సరి. నాని, శర్వానంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్ట్ చాలా కన్పిస్తుంది. ఒకానొక టైమ్‌లో హీరో వేణు కూడా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు. సో, స్టార్‌డమ్ దక్కడం గొప్ప కాదన్నమాట, దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. ఈ విషయమై విజయ్ దేవరకొండకి సోషల్ మీడియా వేదికగా క్లాసులు పీకేవారు ఎక్కువైపోయారు. వాటికి ఆయన తన 'ఆటిట్యూడ్'తో సమాధానం చెప్పేశాననుకుంటే ఎలా? బౌన్స్ బ్యాక్ అయితేనే విజయ్ దేవరకొండ తన సత్తా చాటినట్లవుతుంది. అలా బౌన్స్ బ్యాక్ అయ్యాక మాట్లాడాల్సిన మాటలు ముందే మాట్లాడటం సబబు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ దేవరకొండని ఓ విషయంలో అభినందించాలి. 'బౌన్స్ బ్యాక్' అవుతానని కసిగా చెప్పడం. సినీ పరిశ్రమతో అస్సలేమాత్రం సంబంధం లేని వ్యక్తి, సినిమాల్లో స్టార్‌డమ్ సంపాదించుకున్న దరిమిలా, చాలామందికి ఈ యంగ్ స్టర్ ఆదర్శంగా మారాడు. దాన్ని ఆయన 'బాధ్యత'గా భావించాల్సి వుంటుంది.