కమల్‌హాసన్ రూపొందించిన 'విశ్వరూపం' సినిమా ఎన్నో వివాదాల్ని ఎదుర్కొంది. తమిళనాడులో ప్రభుత్వం నుంచి కూడా ఈ సినిమా కష్టాల్ని చవిచూసింది. 'విశ్వరూపం' రాజకీయ వివాదాల కారణంగా ఎంతో నష్టపోయిందని కమల్‌హాసన్ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 40 కోట్లు నష్టపోయినట్లు ఈ మధ్యన కూడా కమల్‌హాసన్ ఆరోపించాడు. అయితే ఇప్పుడాయన 'విశ్వరూపం-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా పనులు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయట. త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు విశ్వనటుడు. అయితే సినిమా కంటే వివాదాలు ముందుగా ఊపిరి పోసుకోవడానికి సన్నద్ధమవుతున్నాయట. ఈ మధ్యకాలంలో కమల్‌హాసన్ తమిళనాడులోని అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీలోని పన్నీర్ సెల్వం వర్గానికి ఆయన మద్దతుదారుడు. దాంతో సహజంగానే అధికారంలో ఉన్న వర్గం (శశికళ) కమల్‌హాసన్‌కి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గం మధ్య సయోధ్య అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరూ కలిసిపోతే కమల్‌హాసన్‌కి కొత్త కష్టాలు తప్పకపోవచ్చు. సినిమా నటుడిగా కమల్‌హాసన్‌కి దేశవ్యాప్తమైన గుర్తింపు ఉంది. విలక్షణమైన చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. దురదృష్టవశాత్తూ ఆయన సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి.