ఆయన సినిమాలే మాట్లాడతాయి, అతను మాత్రం చాలా తక్కువ మాట్లాడతాడు - ఎక్కువ పని చేస్తాడు. అతనే 'బాహుబలి' రాజమౌళి. జక్కన్న అనీ, దర్శక ధీరుడనీ, ఇంకోటనీ రాజమౌళి గురించి పిలుస్తున్నాంగానీ 'బాహుబలి' రాజమౌళి అనే పిలుపు కన్నా ఆయనకు గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. 'బాహుబలి-1'ని మించి, 'బాహుబలి-2'పై అంచనాలు నెలకొన్నాయి. వెయ్యి కోట్లు సాధించబోతోందని 'బాహుబలి-2' గురించి బాలీవుడ్ చెబుతోంది. ఇది మన తెలుగు దర్శకుడికి తద్వారా తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా భావించాల్సి ఉంటుంది. రాజమౌళి ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ళడు, ఎవర్నీ తక్కువగా చూడడు. ఏదన్నా చిన్న సినిమా నుంచి తనకు పిలుపు వస్తే, ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళతాడు. చిన్న హీరోనీ, పెద్ద హీరోనీ అభినందిస్తాడు వారి సినిమాలు విడుదలైనప్పుడు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం అనే గొప్ప సూక్తిని రాజమౌళి తుచ తప్పకుండా పాటిస్తాడు. అదే రాజమౌళిని ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చిందనడం నిర్వివాదాంశం. ఎవర్నీ విమర్శించకపోవడం రాజమౌళి నైజం. అలాగే తన సినిమా గురించి లేనిపోని గాసిప్స్ వస్తే ఖండించి, క్లారిటీ ఇవ్వడం రాజమౌళికే చెల్లింది. కొత్తగా సినీ రంగంలోకి వచ్చేవారెవరైనా రాజమౌళిని చూసి చాలా చాలా నేర్చుకోవాలి. ముందుగా రాజమౌళి సింప్లిసిటీని అర్థం చేసుకుంటే కెరీర్‌లో మంచి విజయాల్ని అందుకోవడం ఎవరికైనా కష్టం కాకపోవచ్చు.