ప్రతి విషయాన్నీ వివాదం చేయడం ఇప్పుడో ఫ్యాషన్ అనుకోవాలేమో. సోషల్ మీడియా రాకతో చిన్న విషయం కూడా పెద్ద వివాదంగా మారిపోతోంది. టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ హఠాన్మరణం సినీ, రాజకీయ వర్గాల్ని షాక్‌కి గురిచేసింది. దేవినేని నెహ్రూకి సినీ పరిశ్రమలోనూ పలువురితో సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయాలకతీతంగా ఆయన్ని చాలామంది అభిమానిస్తారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి కూడా దేవినేని నెహ్రూ సన్నిహితుడే. నెహ్రూతో తన అనుబంధం గురించి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తనను షాక్‌కి గురిచేసిందన్నారు. అయితే ఇక్కడే వివాదం స్టార్ట్ అయ్యింది. వర్మ తీసిన 'వంగవీటి' సినిమా వివాదాల్లోకెక్కిన సంగతి తెలిసినదే. ఆ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. 'వంగవీటి' వివాదంలో 'దేవినేని' కుటుంబం పాత్ర గురించి బెజవాడ రాజకీయాల్లో అందరికీ తెలుసు. 'వంగవీటి' సినిమాని వర్మ, దేవినేని కోణంలో తీశాడని వంగవీటి రాధ ఆరోపిస్తున్నారు. సినిమా వివాదం ఇలా నడుస్తున్న సమయంలో వర్మ, దేవినేనితో తన అనుబంధం చాటుకోవడం కొందరికి నచ్చలేదు. వారంతా సోషల్ మీడియాపై మండిపడుతున్నా, వారు గుర్తుంచుకోవాల్సిన విషయమొకటుంది. ఎవరైనా చనిపోతే, వారి గౌరవార్ధం వారితో ఉన్న అనుబంధం చాటుకోవడం అనేది ఓ సాధారణ ప్రక్రియ. అదే వర్మ చేశారు. కానీ వర్మ విషయంలోనే ప్రతీదీ వివాదం చేయడం ద్వారా వచ్చే లబ్ది ఏమిటో అర్థం కావడంలేదని వర్మ అభిమానులంటున్నారు.