స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌తో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ దర్శకత్వంలో కాగా, మరోటి వర్మ ప్రియ శిష్యుడు తేజ డైరెక్షన్‌లో. ముచ్చటగా మూడోది కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూడు సినిమాలకూ టైటిల్స్ ఖరారయ్యాయి. వర్మ సినిమాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనీ, తేజ సినిమాకి 'ఎన్టీఆర్' అనీ, జగదీశ్వరరెడ్డి సినిమాకి 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. వీటిలో ఇంకా ఏదీ సెట్స్ మీదికి వెళ్లలేదు. వేటికవే మూడు విభిన్నమైన పర్వాలను ఎత్తుకున్నారు ఎన్టీఆర్ జీవిత చరిత్ర నుండి. అయితే సినిమా సంగతి ఇలా ఉండగా, సినిమాకి కథని ఆయన చేత ఎన్టీఆర్ ఆత్మ స్వయంగా దగ్గరుండి రాయిస్తుందనీ, వర్మ చిత్తగించారు. కాగా వర్మనే ఫాలో అవుతున్నాడు కాబోలు డైరెక్టర్ జగదీశ్వరరెడ్డి. ఆయన కూడా ఇదే మాట చెబుతున్నాడు. నా వెనక ఉన్నది ఎన్టీఆర్. ఆయనే నా చేత ఈ కథ రాయిస్తున్నారు. ఆయనకి నేను పెద్ద అభిమానిని. ఆయనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్నీ కథని రాయడానికి ప్రేరేపిస్తోంది అంటున్నాడాయన. సినిమా సంగతి ఎలా ఉన్నా, కథల విషయంలో డైరెక్టర్స్ స్టోరీస్ భలే బాగున్నాయి. మాంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక ఈ మాట చెప్పడానికి తేజ ఒక్కడే మిగిలాడు. తేజ నోటి వెంట ఏం మాట వస్తుందో చూడాలిక. ఇదిలా ఉండగా తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ జీవిత చరిత్రలో, ఎన్టీఆర్ సినీ, రాజకీయజీవితంలోని పలు ముఖ్యమైన అంశాలను ప్రస్థావించనున్నారు. వర్మ సినిమాకి వచ్చే సరికి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పులను చూపించనున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి రాక ముందు లక్ష్మీపార్వతి ఏంటి? అనే కాన్సెప్ట్‌తో కేతిరెడ్డి సినిమా మొదలు కానుంది. మూడు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. అదీ ఎన్టీఆర్ బయోపిక్స్ సంగతి.