తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఘటన ని `దిశా ఎన్‌కౌంటర్` పేరుతో సినిమాగా మలుస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఇది వరకే ట్రైలర్ ని విడుదల చేశాడు. సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముంఉదకు రాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా దిశా ఘటనని సినిమాగా ఎలా తీస్తారని? ఇది కేవలం డబ్బులు సంపాదించడానికి వర్మ చేస్తున్న ప్రయత్నం అని విమర్శించారు.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సినిమాను ఆపేలా తగు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దిశా తండ్రి పిటిషన్ వేశారు. దిశాపై లైంగిక దాడి, హత్య, దోషుల ఎన్‌కౌంటర్ తదితర అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ప్రత్యేక కమిటీ విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్మాత నట్టికుమార్ మాత్రం `జరిగిన విషయాలే తెరపై చూపిస్తున్నాం. అభ్యంతరకరమైన విషయాలేం సినిమాలో లేవు. ఒకవేళ ఉంటే సెన్సార్ అభ్యంతరం చెబుతుంది. సెన్సార్ సినిమా చూసి అభిప్రాయం చెప్పేంత వరకూ ఆగండి`` అంటున్నారు.