ఈ సంక్రాంతి బాక్సాఫీసు దగ్గర హడావుడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. చిరంజీవి - వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ - వీర సింహారెడ్డి పండక్కి వస్తున్నాయి. వీటితో పాటు `వారసుడు` కూడా రెడీ అయ్యాడు. విజయ్ నటించిన సినిమా ఇది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఓ వైపు.. చిరు, బాలయ్య సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు మొదలైపోయాయి. `వారసుడు` పాటలూ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి చిరు, బాలయ్యలు విస్త్రుతంగా ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. అయితే.. విజయ్ ని మాత్రం పబ్లిసిటీలో దించడం చాలా కష్టం.
ఎందుకంటే.. విజయ్ ఎప్పుడూ ప్రమోషన్లలో కనిపించడు. తమిళ నాట కూడా విజయ్ ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొంటాడంతే. తమిళనాట ఫ్యాన్స్... ఈ పద్ధతికి అలవాటు పడిపోయారు. అయితే తెలుగులో అలా కుదరదు. ఎంత గట్టిగా ప్రమోషన్లు చేయిస్తే అంత మంచిది. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తుంది. చిరు, బాలయ్యసినిమాల పబ్లిసిటీ ఓ రేంజ్‌లో జరుగుతుంది. దానికి ధీటుగా నిలబడాలంటే... విజయ్ ని రంగంలోకి దించాల్సిందే. అందుకోసం దిల్ రాజు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. విజయ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవడమే కాకుండా.. తనతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇప్పించాలని దిల్ రాజు చూస్తున్నాడు. విజయ్‌కి ఈ సినిమా కోసం దాదాపుగా రూ.100 కోట్లు పారితోషికం ఇచ్చారు. అయినా సరే... ప్రమోషన్ల కోసం బతిమాలుకోవాల్సివస్తోంది. మరి దిల్ రాజు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.