విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం విదితమే. తొలి సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడా.? లేదా.? అన్న సంగతి పక్కన పెడితే, హీరో ఆనంద్ దేవరకొండ మాత్రం నటుడిగా మంచి ప్రయత్నమైతే చేశాడన్న ప్రశంసలు దక్కుతున్నాయి. మరోపక్క దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర కూడా 'దొరసాని' కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్‌పై విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇదిలా వుంటే, కెవిఆర్ మహేంద్రతో ఓ సినిమా చేస్తానంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రకటించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తొలి సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్ ఇవ్వలేకపోయినా, మంచి ప్రయత్నం చేసినందుకుగాను కెవిఆర్ మహేంద్రకి, విజయ్ దేవరకొండ ఇచ్చిన గిఫ్ట్‌గా దీన్ని భావిస్తున్నారు చాలామంది. అయితే, 'దొరసాని' ప్రమోషన్ కోసమే విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశాడు తప్ప, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదే కాదని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు.
ఇదిలా వుంటే, 'దొరసాని' సినిమాకి విజయ్ దేవరకొండ తాను చేయగలిగినదంతా చేశాడు పబ్లిసిటీ పరంగా. నిజానికి, విజయ్ దేవరకొండ 'దొరసాని' వెనుక లేకపోయి వుంటే, ఆ సినిమాకి రిలీజ్‌కి ముందు అంత హైప్ వచ్చి వుండేది కాదన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, తన తాజా సినిమా 'డియర్ కామ్రేడ్' రిలీజ్ పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తర్వాతా విజయ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. మరి, కేవీఆర్ మహేంద్రకి విజయ్ ఛాన్సిచ్చేదెప్పుడో ఏమో.!