లాక్ డౌన్ తరవాత... ఓ టీ టీలో మలయాళం సినిమాల్ని ఎక్కువగా చూడడం అలవాటు చేసుకున్నారు మన తెలుగు ప్రేక్షకులు. వాళ్లకు బాగా నచ్చిన సినిమాలలో `డ్రైవింగ్ లైసెన్స్` ఒకటి. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మంచి చర్చ జరిగింది. సినిమా చాలా బాగుందంని, తెలుగులో రీమేక్ చేస్తే ఇంకా బాగుంటుందని సలహాలు వినిపించాయి. కొంతమంది నిర్మాతలు కూడా ఈ కథని తెలుగులోకి తీసుకొద్దామనుకున్నారు. కొంతమంది హీరోలకు చూపించారు. చూసినవాళ్లంతా `చాలా బాగుంది` అనడం తప్ప, రీమేక్ చేద్దామని ఎవ్వరూ ముందుకు రాలేదు.
దాంతో నిర్మాతలు కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా పవన్ కల్యాణ్‌కి విపరీతంగా నచ్చిందని, ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. పవన్ కి నచ్చిందంటే నిర్మాతలు ఊరుకుంటారా? ఈ సినిమా రైట్స్ కోసం ఇప్పుడు ఎగబడుతున్నారు. ఈ సినిమా రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటే, వాళ్లకు కాల్షీట్లు ఇస్తానని పవన్ చెప్పాడట. దాంతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం క్యూ మొదలైంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో?