అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి 'పుష్ష' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రష్మిక కథానాయిక. ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి స్థానంలో మరో నటుడు వచ్చి చేరినట్టు టాక్.
పుష్ష ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్. అక్కడే విజయ్ సేతుపతికి సమస్య ఎదురైంది. తమిళంలో విజయ్ సేతుపతికి స్టార్ ఇమేజ్ ఉంది. తెలుగులో విలన్‌గా చేయడంలో విజయ్‌కి ఎలాంటి అభ్యంతరం లేదు. తమిళంలో మాత్రం తనని విలన్‌గా చూపిస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం విజయ్‌లో ఉంది. తన ఇమేజ్‌కి ఏమైనా డామేజ్ ఎదురవుతుందేమో అని విజయ్ భయపడుతున్నాడు. అందుకే.. ''పుష్ష సినిమాలో నటించడానికి అభ్యంతరం లేదు గానీ, తమిళ వెర్షన్‌కి మరో నటుడ్ని ఎంచుకోండి'' అని సలహా ఇచ్చాడు విజయ్. దాంతో.. తమిళ వెర్షన్ కోసం బాబీ సింహాని ఎంచుకున్నారు. విలన్ కనిపించే సన్నివేశాన్ని రెండు సార్లు తీస్తారు. ఒకటి విజయ్ తో, మరోటి బాబీ సింహాతో. బాబీ సింహా వెర్షన్ ని తమిళంలో విడుదల చేస్తారు. విజయ్ సేతుపతి నటించిన వెర్షన్‌ని మిగిలిన భాషల్లో విడుదల చేస్తారు. ఇదీ.. పుష్ష టీమ్ ప్లాన్.
అయితే ఇప్పుడు ఈ ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల్లోనూ ఒకే నటుడితో చేయిస్తే.. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకున్నవాళ్లవుతారు. పైగా ఒక పాత్ర కోసం ఇద్దరు నటులకు పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే అన్ని వెర్షన్లూ బాబీ సింహాతోనే చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ విషయంపై త్వరలోనే ఓ నిర్ణయానికి రావొచ్చు.