ఈ సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్ సినిమా రేస్‌లో ఉంది. 'అజ్ఞాతవాసి', 'జై సింహా', 'రంగుల రాట్నం' స్ట్రెయిట్ సినిమాలైతే, వీటితో డబ్బింగ్ సినిమా 'గ్యాంగ్' పోటీ పడుతోంది. సంక్రాంతి తర్వాత ఏప్రిల్ వరకూ కుప్పలు తెప్పలుగా డబ్బింగ్ సినిమాలు తెలుగు తెరపై దాడికి సిద్ధంగా ఉన్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'రోబో 2.0', 'కాలా' సినిమాలు, విశాల్ సినిమా 'అభిమన్యుడు', విక్రమ్ సినిమా 'స్కెచ్', నయనతార నటించిన 'కర్తవ్యం', జయం రవి నటించిన 'టిక్ టిక్ టిక్', జై - అంజలి నటించిన 'బెలూన్' తదితర చిత్రాలు రాబోతున్నాయి. అయితే సంక్రాంతి తర్వాత క్యూ కట్టేందుకు స్ట్రెయిట్ సినిమాలు కూడా డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ కండీషన్స్ నేపథ్యంలో స్ట్రెయిట్ సినిమా అయినా, డబ్బింగ్ సినిమా అయినా ఒకదానితో ఒకటి పోటీ పడితే, ఎంతో కొంత ఇబ్బంది తప్పదు.
రాబోయే వాటిలో ప్రెస్టీజియస్ మూవీస్ చాలా ఉన్నాయి. వాటికే ఇంకో స్ట్రెయిట్ సినిమా ఏదైనా క్లాష్ అవుతుందా అన్న టెన్షన్ నెలకొంది. ఈ టైంలో డబ్బింగ్ సినిమాలు స్ట్రెయిట్ సినిమాల్ని ఇంకా భయపెట్టేస్తున్నాయి. విషయం ఉన్న సినిమాలే ప్రేక్షకుల్ని అలరిస్తాయి అన్న మాట నిజమే కానీ, స్ట్రెయిట్ సినిమాలకి డబ్బింగ్ దెబ్బ తగిలితే, తెలుగు సినిమా పరిశ్రమకి ఇబ్బందులు తప్పవు. అందుకే కొన్ని సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల్ని, అనుమతించొద్దు అనే డిమాండ్ వస్తుంటుంది.
ఏప్రిల్ నెల విషయానికి వస్తే, 'రోబో 2.0' సినిమా కారణంగా కాస్త గందరగోళం గతంలో వ్యక్తమయింది. అదింకా పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు.