లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: లక్కీ భాస్కర్  
దర్శకత్వం:  వెంకీ అట్లూరి
కథ - రచన : వెంకీ అట్లూరి


నటీనటులు:  దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, రిత్విక్, సాయి కుమార్. సచిన్ ఖేద్కర్, రాంఖీ తదితరులు.      


నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ,సాయి సౌజన్య.


సంగీతం: జీవి.ప్రకాష్  
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
ఎడిటర్:  నవీన్ నూలి 


బ్యానర్:  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌
విడుదల తేదీ: 31 ఆక్టోబర్ 2024
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3.25/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

దుల్కర్ సల్మాన్ ముమ్ముట్టి వారసుడిగా మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. కేవలం మాతృ భాషలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించు కున్నాడు. ఆకట్టుకునే రూపంతో పాటు అతని యాక్టింగ్ కి కూడా అంతా ఫిదా అవాల్సిందే. అమ్మాయిల కలల రాకుమారిడిలా క్రేజ్ తెచ్చుకున్న దుల్కర్ ఈ మధ్య వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం తీసిన 'ఓకే బంగారం' తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన దుల్కర్ తరువాత తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువ అయ్యాడు. ఈ క్రమంలోనే దుల్కర్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మహానటి,   'సీతా రామం' అనే పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కాయి. నెక్స్ట్ కల్కిలో గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఇప్పడు మళ్ళీ లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ రోజు దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన 'లక్కీ భాస్కర్' మూవీ ఎలా ఉందో? దుల్కర్ వంద కోట్ల క్లబ్ కల నెరవేరుతుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.                                 

 

కథ :
భాస్కర్ (దుల్కర్ సల్మాన్)ది సాధారణ మధ్యతరగతి కుటుంబం. బ్యాంకు ఉద్యోగి. భాస్కర్ ఇంట్లో ఒక తమ్ముడు, చెల్లి, తండ్రి, భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు కార్తీక్ ఉంటారు. తన కుటంబాన్ని బాగా చూసుకోవాలి, వారి కోరికలు తీర్చాలి అనుకుంటాడు. కానీ అంతంత మాత్రమే ఉన్న ఆర్థిక పరిస్థితి కారణంగా చుట్టూ సమస్యలు. ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నా ప్రమోషన్ కూడా రాదు. జీవితంలో అన్ని రకాలుగా విసిగిపోతాడు.  కుటుంబ అవసరం కోసం, వారిని బాగా చూసుకోవాలని తాపత్రయంతో  ఒకరోజు తన బ్యాంకులోనే దొంగతనం చేసి చిన్న ఇల్లీగల్ బిజినెస్ మొదలు పెడతాడు. అక్కడి నుంచి భాస్కర్ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోతుంది. మనిషిలో చాలా మార్పులు వస్తాయి. భాస్కర్ ఏం బిజినెస్ స్టార్ట్ చేసాడు? డబ్బులు సంపాదించిన తరువాత ఫ్యామిలీ కష్టాలు తీరాయా? సంతోషంగా ఉన్నాడా? డబ్బుతో  వచ్చిన కష్టాలేంటి? సంపాదన తరువాత భాస్కర్ లో వచ్చిన మార్పు ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

 

విశ్లేషణ: 
ఫస్ట్ ఆఫ్ మొత్తం మిడిల్ క్లాస్ పడే కష్టాలు, ఎమోషన్స్ చూపించి ప్రేక్షకుడు కథని ఓన్ చేసుకునేటట్లు చేసాడు దర్శకుడు. దుల్కర్ నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. జనరల్ గా ఫ్యామిలీ మాన్ ఎలా ఉంటాడో దుల్కర్ అలానే ఉన్నాడు. హీరోయిజం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేవు. భారీ యాక్షన్ సీక్వెన్స్, హీరో ఎలివేషన్స్ ఏమి లేవు.  మధ్య తరగతి కి చెందిన ఒక సామాన్యుడు కేవలం తనకున్న తెలివి తేటల్తో ఎలా ఎదిగాడు, ఎదిగే క్రమంలో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. ట్విస్టులు లేకపోయినా  సినిమా మొత్తం బోర్ కొట్టకుండా చూసేలా ఉంది. అసలు మన కథే, మన జీవితమే అనిపించేలా ఉంటుంది కథ. హీరో బ్యాంక్ అకౌంట్ లో 100 కోట్లు పడడంతో ఇంట్రవెల్ పడుతుంది. అక్కడి నుంచి కథపై కుతూహలం పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా అదిరిపోయే ట్విస్టులు ఏం ఉండవు. ప్రేక్షకుడి ఊహల్లోనే కథ సాగుతుంది. కర్ర విడిచి సాము చేయలేదు దర్శకుడు. అందుకే గందరగోళం లేకుండా ఆడియన్స్ కి బాగా కనక్ట్ అయ్యింది. సూటిగా చెప్పు సుత్తి లేకుండా అన్న యాడ్ లా ఉంది వెంకీ కాన్సెప్ట్. సెకండ్ హాఫ్ మొత్తం షేర్ మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. డబ్బు పెరిగిన తరువాత వారి  లైఫ్ లో  వచ్చిన మార్పులు, కుటుంబ కలహాలు చూపించారు. దీపావళికి దుల్కర్ గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు. దీవాళీ సందర్భంగా సరదాగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా చూసేలా ఉంది.   

 

ట్రైలర్  తోటే మరిన్ని అంచనాలు పెంచారు. అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఉంది లక్కీ భాస్కర్ మూవీ. దర్శకుడు కథ రాసిన విధానం, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం సూపర్ అని చెప్పాలి. తెలుగులో ఫైనాన్షియల్ క్రైమ్ మీద వచ్చిన సినిమాలు తక్కువ. బ్యాంకింగ్ సెక్టార్‌లో అయితే పెద్దగా సినిమాలు రాలేదు. ఈ మూవీ వీటన్నిటిని టచ్ చేయటం కథకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. 1990ల్లో దేశాన్ని కుదిపేసిన ఒక స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా లక్కీ భాస్కర్ తెరకెక్కింది. ఇప్పటి వరకు ఆ కుంభకోణంపై కొన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి కానీ అవన్నీ స్కామ్ చేసిన వ్యక్తుల చుట్టూ తిరిగాయి. స్కామ్ చుట్టూ ఏం జరిగింది. ఆ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ లైఫ్ ఎలా మారింది అన్న విషయాలను దర్శకుడు ప్రజంట్ చేసాడు. అదే ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.  డబ్బుకి లోటు లేకుండా సంపాదించిన హీరో చివరికి ఎలా రియలైజ్ అయ్యాడనే పాయింట్ బాగా చూపించాడు. 'వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడో ఒకసారి మనిషిని కింద పడేస్తాయి', 'జూదం లో ఎంత గొప్పగా ఆడామన్నది ముఖ్యం కాదు ఎప్పుడు ఆపామన్నది ముఖ్యం' 'వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి...రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిమీద కనపడాలి' 'మాదక ద్రవ్యాలు కంటే డబ్బు ఇచ్చే కిక్కే గొప్పది లాంటి'  డైలాగ్స్ అవునని ప్రేక్షకుడిని ఒప్పించేలా ఉన్నాయి.           

 

నటీ నటులు:
దుల్కర్ సల్మాన్ నటనకి వంకలు పెట్టడానికి లేదు. అద్భుతంగా నటించాడు. మధ్య తరగతి వ్యక్తిగా, రిచ్ మాన్ గా వేరియెషన్స్ అద్భుతంగా ఉన్నాయి. దుల్కర్ నటన చాలా నాచురల్ గా ఉంది. దుల్కర్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కూడా దుల్కర్ డబ్బింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేసాడు. భాస్కర్ పాత్రలో దుల్కర్ ని తప్ప మరొకరిని ఊహించలేము. ఇప్పటికే తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న దుల్కర్ ఈ సినిమాతో మరింత చేరువ అయ్యాడు. దుల్కర్ కి జోడీగా నటించిన మీనాక్షి చౌదరికి మొదటి హిట్ దొరికినట్టే. ఇప్పటివరకు మీనాక్షి చాలా సినిమాలు చేసినా నటనకి ఆస్కారమున్న పాత్ర పడలేదు. త్రివిక్రమ్, మహేష్ కాంబో మూవీ గుంటూరు కారం చేసినా ఏం పేరు రాలేదు. కానీ ఈ సినిమా తనకి గుర్తింపు నిచ్చింది. తన పాత్రలో హుందాగా ఉంది. సీనియర్ హీరో రాంఖీ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో నటించారు. కార్తీక్ హీరోగా నటించిన RX100 సినిమా తరువాత రాంఖీ నటించిన సినిమా ఇదే. తండ్రి పాత్రలకి మంచి ఆప్షన్ గా అనిపిస్తుంది. సాయికుమార్, సచిన్ ఖేద్కర్  మిగాతా వాళ్ళు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు.            

 

టెక్నికల్ :
సార్ మూవీ తరువాత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తో వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి పాజిటీవ్ వైబ్స్ ఇచ్చింది. ఎక్కువ ప్రయోగాల జోలికి పోకుండా సాధారణ కథని తన దృక్పథంలో చెప్పటం వెంకీ స్పెషాలిటీ. ఈ సినిమాలో కూడా అదే నిరూపించుకున్నాడు. మధ్య తరగతి కష్టాలు, కుటుంబ బాధలు, చాలీ చాలని జీతంతో పడే కష్టాలు ఇది వరకే తెరకెక్కాయి. కానీ పాత కథని తీసుకుని ఆడియన్స్ ని మెప్పించే విధంగా చెప్పటంలో హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ అయ్యాడు వెంకీ అట్లూరి. ఈ కథకి దుల్కర్ ని ఎంచుకోవటంతోనే సగం విజయం సాదించేసాడు. ఎక్కడా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగాడు. GV ప్రకాష్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో GV ప్రకాష్ ఆకట్టుకున్నాడు. పాటలు సినిమా కథని డిస్టర్బ్ చేయకుండా సాగాయి. కొన్ని సినిమాల్లో  ప్రత్యేకంగా పాటలు చొప్పించిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో అలా అనిపించవు.      సినిమాటోగ్రఫీ బాగుంది.1989 టైంలో జరిగిన కథ కావటంతో అప్పుడు ముంబై సిటీ ఎలా ఉండేదో చక్కగా ప్రజంట్ చేయగిలిగారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం తెలుస్తోంది. నైన్టీస్ లో ముంబైలో ఇల్లులు, బ్యాంకులు ఎలా ఉండేవో ఎగ్జాట్ గా అలా చిత్రీకరించటంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  

 


ప్లస్ పాయింట్స్

దుల్కర్ 
కథ 
స్క్రిన్ ప్లే 
మ్యూజిక్ 

 

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ లో కాస్త లాగ్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : దీవాళీ ఆటం బాంబు 'లక్కీ భాస్కర్'..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS