నందమూరి కళ్యాణ్‌రామ్, మెహ్రీన్ కౌర్ జంటగా వచ్చిన సంక్రాంతి సినిమా 'ఎంత మంచివాడవురా', రెండు పెద్ద సినిమాల మధ్య నలిగిపోయింది. అవును, తొలి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చినా.. చాలా చోట్ల ఈ సినిమా తేలిపోయింది. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటా పోటీగా వసూళ్ళు సాధిస్తున్న వేళ, ఇంకో సినిమా గురించి ప్రేక్షకులు ఆలోచించడానికీ ఇష్టపడకపోవడం గమనార్హం. మరోపక్క, తొలి షో రిజల్ట్ తేలిపోవడంతో, 'ఎంత మంచివాడవురా' వైపు చూడలేకపోయారు ప్రేక్షకులు.
సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం విదితమే. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసినా.. అవేవీ థియేటర్లకు జనాన్ని రప్పించలేకపోతున్నట్లే కన్పిస్తోంది. కొన్ని చోట్ల మార్నింగ్ షో కూడా ఫుల్ అవలేదు. సాయంత్రానికి సినిమా పూర్తిగా డల్ అయిపోయేసరికి.. ఆ సినిమాని తీసేసి, 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' షోస్ వేయాలనే డిమాండ్లు వచ్చాయట. రెండో రోజు.. అంటే నేడు, ఈ సినిమా చాలా థియేటర్ల నుంచి ఔట్ అయిపోనుందనే చర్చ జరుగుతోంది. మరోపక్క, సంక్రాంతి సీజన్ కాబట్టి, పెద్దగా 'ఎంతమంచివాడవురా' సినిమాకి కొన్ని చోట్ల ఇబ్బంది వుండకపోవచ్చని అంటున్నారు. పండగ సీజన్ ముగిసేసరికి మళ్ళీ వీకెండ్ సీజన్ షురూ అవుతుంది గనుక.. ఈ రెండు మూడు రోజులు తట్టుకోగలిగితే 'ఎంతమంచివాడవురా' టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లను సాధించొచ్చేమో.!