ఎన్నికల ఫలితాలకు ముందు - సర్వేలు హడావుడి చేస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ టీవీ ఛానళ్లు, లగడపాటి లాంటి రాజకీయ జ్యోతిష్యులు `శాస్త్రీయత` పేరుతో లెక్కలు కట్టి మరీ - అంకెలు చెప్పేస్తున్నారు. అయితే... ఏ సర్వేలోనూ పవన్ కల్యాణ్ జనసేనని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పవన్ పార్టీకి 0 నుంచి 3 స్థానాలు మాత్రమే వస్తాయని తేల్చేస్తున్నాయి. అంటే అత్యధికంగా మూడు స్థానాలు గెలవొచ్చు.
ఒక్క స్థానంలోనూ గెలవకపోవొచ్చు. ఇదీ... సర్వేల సారాంశం. అయితే... ఓట్లని చీల్చడంలో మాత్రం పవన్ సఫలీకృతుడయ్యాడని, పది శాతం ఓట్లు జనసేన ఖాతాలోకి మళ్లాయని మాత్రం లెక్కగడుతున్నారు. టీడీపీ - వైకాపా గెలుపు మధ్య అంతరం కూడా ఈ పది శాతమే కావడం విశేషం. అంటే.. పవన్ సీట్లు గెలవకపోయినా, ఓట్లు కొల్లగొట్టి - అధికార పీఠంపై ఎవరు కూర్చుంటారన్నది డిసైడ్ చేస్తున్నాడన్నమాట.
అయితే సర్వేల పట్ల పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన కనీసం 10 నుంచి 15 సీట్ల వరకూ గెలుచుకుంటుందని, ఒక పార్లమెంటు స్థానాన్నీ కైవసం చేసుకుంటుంనద్నది వాళ్ల వ్యక్తిగత లెక్క. ఈ సర్వేలు కూడా మాయేనని.. పవన్ స్టామినాని అంచనా వేయలేకపోయాయని 23న అసలు లెక్కలు తేలతాయని గట్టి విశ్వాసంతో చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.