ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న 'సీత'పై అంచనాలు బాగానే ఉన్నాయి. నిన్న అంటే మే 23 ఎన్నికల ఫలితాల హోరులో 'సీత'ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు మళ్లీ 'సీత' హవా మొదలైంది. సీత విడుదల కానున్న ధియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రమోషన్స్ పరంగా 'సీత' విషయంలో చేసిన హంగామాకి ఆకాశమే హద్దు. దాంతో అనుకున్న రేంజ్‌లో హైప్ క్రియేట్ చేయడంలో 'సీత' యూనిట్ సక్సెస్ అయ్యింది. ఇక విడుదలయ్యాక వసూళ్ల విషయంలో 'సీత' జోరు ఎలా ఉంటుందో మరి కొద్ది గంటల్లో తెలుస్తుంది. సోషల్ మీడియాలో కాజల్‌కి పిచ్చ క్రేజ్ ఉంది. 'సీత'ను హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ప్రమోట్ చేయడం సినిమాకి అదనపు ఆకర్షణ. కమర్షియల్‌ని నమ్మి సినిమాలు ఒప్పుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సారి ఎందుకో 'సీత'తో ప్రయోగం చేయబోతున్నాడు. 'సీత' బెల్లంకొండకు ఎలాంటి ఇమేజ్‌ని సొంతం చేస్తుందో చూడాలిక. ఇదిలా ఉంటే, విడుదల దగ్గరయ్యాక సీత సినిమానూ కొన్ని వివాదాలు వెంటాడాయి. కాన్సెప్ట్‌తో 'సీత' అనే పేరుకున్న పవిత్రతను భంగపరుస్తున్నారంటూ, కొందరు ఆందోళన చేశారు. టైటిల్ మార్చాలనీ, లేకుంటే సినిమా విడుదల ఆపేస్తామంటూ వారు హెచ్చరించారు. కానీ దర్శకుడు తేజ టైటిల్ విషయంలో ఎలాంటి మార్పు జరగదని గట్టిగా చెప్పారు. ఏమో సినిమాలో కంచులా కనిపిస్తున్న 'సీత' బాక్సాఫీస్ వద్ద ఆ మోత మోగిస్తుందో లేదో చూడాలిక.