సంక్రాంతి అల్లుళ్లు వచ్చేస్తున్నారు. అదేనండీ వెంకటేష్, వరుణ్‌తేజ్. అవును మరి ఈ ఇద్దరూ తోడల్లుళ్లుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్' వచ్చేది సంక్రాంతికే కదా. తాజాగా చిత్రయూనిట్ టీజర్‌ని వదిలింది. టైటిల్‌కి తగ్గట్లే ఫుల్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో నింపేశారీ టీజర్‌ని. ఫస్ట్ ఇంపాక్ట్ ఈజ్ ద బెస్ట్ ఇంపాక్ట్ అన్నారు పెద్దలు. అందుకే టీజర్‌తోనే ఆ బెస్ట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసేశారీ సంక్రాంతి అల్లుళ్లు. ఓ మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత అని మొదలెట్టాలి అని వెంకీ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.
పెళ్లికి ముందు తనలో ఉన్న కాన్ఫిడెన్స్‌నీ, పెళ్లి తర్వాత వచ్చిన ఫ్రస్టేషన్‌నీ వెంకీ తనదైన శైలిలో టైటిల్‌కి కరెక్ట్‌గా కనెక్ట్ చేస్తూ చెప్పేశాడు. అలా బోలెడంత ఫన్ క్రియేట్ చేసేశాడు. తర్వాత వరుణ్‌తేజ్ వంతు. ఓ మగాడి చరిత్ర గురించి చెప్పాలంటే బిఫోర్ తెలంగాణా, ఆఫ్టర్ తెలంగాణా అంటూ వరుణ్ డైలాగ్.. ఇంకేముంది కట్ చేస్తే సేమ్ టు సేమ్ వెంకీ స్టోరీనే. పెళ్లయ్యాక పెళ్లాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసనే కాన్ఫిడెన్స్‌తో ఉన్న ఈ ఇద్దరు మగాళ్లూ పెళ్లి తర్వాత పెళ్లాలతో పడే పాట్లు మనకు కడుపుబ్బా నవ్వించేస్తున్నాయి.
హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహ్రీన్‌లు టీజర్‌లో చాలా అందంగా కనిపించారు. ఒక నిమిషం 20 సెకన్లపాటు ఉన్న ఈ టీజర్‌లోనే ఇంత ఫన్ చూపించేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం పక్కా అనిపిస్తోంది. సంక్రాంతికి నవ్వులు పూయించే ధీటైన మూవీ 'ఎఫ్ 2' అవుతుందనిపిస్తోంది. చూడాలి మరి.