ర‌జ‌నీ... వ‌న్ అండ్ ఓన్లీ... సూప‌ర్ స్టార్‌..!

By iQlikMovies - December 12, 2018 - 13:20 PM IST

మరిన్ని వార్తలు

ర‌జ‌నీకాంత్ ఓ మంత్ర‌గాడు. త‌న‌ మాట‌, స్టైల్‌, న‌డక‌, న‌ట‌న అన్నీ - ఓ మ్యాజిక్‌లా అనిపిస్తాయి. వెండి తెర‌ని వేదిక‌గా చేసుకొని త‌న జాదూ చూపిస్తున్న పీసీ స‌ర్కార్ లాంటి మంత్ర‌గాడు... ర‌జ‌నీకాంత్!!

ర‌జ‌నీ క‌మ‌ల్ హాస‌న్‌లా  అంద‌గాడు కాదు... హృతిక్ రోష‌న్‌లా కండ‌లు తిరిగిన దేహం కూడా లేదు.... రంగైతే కాటుకే కాస్త తెల్ల‌గా ఉంటుంది. అయినా ర‌జ‌నీ అంటే ప‌డిచ‌స్తారు ఫ్యాన్స్‌!  ఆయ‌న సినిమా వ‌స్తే. పండ‌గ‌ల‌న్నీ క‌ట్ట‌క‌ట్టుకొని వ‌చ్చిన‌ట్టే. మ‌రి  దాన్నేమంటారు మ్యాజిక్ కాక‌పోతే...??  ర‌జ‌నీ స్టైల్‌గా అలా న‌డిచొస్తే చాలు, ''ఈ బాషా ఒక్క‌సారి చెబితే, వంద‌సార్లు చెప్పిన‌ట్టే'' అంటూ ఓ డైలాగ్ ప‌డేస్తే చాలు 'జ‌న్మ‌ధ‌న్యం' అంటూ మురిసిపోతారు అభిమానులు. త‌మిళ‌నాటే కాదు, సౌత్ ఇండియా మొత్తం... ఆ మాట‌కొస్తే భార‌త‌దేశం మొత్తం.. ర‌జ‌నీ లా స్టైల్‌ని న‌మ్ముకొన్న హీరో లేడు. స్టైల్‌కి ర‌జ‌నీ ఓ శాశ్వ‌త చిరునామా. ఈ విష‌యంలో ఎవ్వ‌రైనా స‌రే, ర‌జ‌నీ త‌ర‌వాతే!!

ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌కి మ‌రింత విశిష్ట‌త‌, విల‌క్ష‌ణ‌త తీసుకొచ్చింది.. ఆయ‌న క్యారెక్ట‌ర్. రీలు లైఫులోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ ఆయ‌న హీరో. సాధార‌ణంగా సినీ జీవితంలో ఉన్న‌వాళ్లు మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు రారు. విగ్గులు, ట‌చ‌ప్‌లు, ష‌ర్టు మీద ష‌ర్టు... ఇలా నానా హంగామా ఉండాల్సిందే. కానీ ర‌జ‌నీ అలా కాదు. బ‌య‌ట స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తారు. ''తెర‌పై చూసిన సూప‌ర్ స్టార్ ఈయ‌నేనా'' అని జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతారు. ''నేను తెర‌పై మాత్ర‌మే హీరో. బ‌య‌ట ఆ హంగులెందుకు. నేనూ మీలానే సాధార‌ణ‌మైన వ్య‌క్తిని'' అని చెప్పుకొనే అతి గొప్ప వ్యక్తిత్వం ఆయ‌న సొంతం.

ఏ స్టార్ హీరోకైనా సెట్లో క్యార్ వ్యాన్ ఉంటుంది. త‌న షాట్ అయిపోగానే హీరోగారు క్యార్ వ్యాన్‌లోకి వెళ్లి రిలాక్స్ అయిపోతారు. హీరో అనేంటి?  ఈమ‌ధ్య హాస్య‌న‌టుల‌కూ కార్ వాన్ కావ‌ల్సిందే. కానీ ర‌జ‌నీ అలా కాదు. షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పే వ‌ర‌కూ క్యార్ వ్యాన్ వాడ‌రు. లంచ్ బ్రేక్ కూడా... త‌న టీమ్ తో క‌ల‌సే చేస్తారు. బ్రేక్ టైమ్‌లో లైట్ బోయ్స్‌ని చుట్టూరా కూర్చోబెట్టుకొని జోకులు వేసుకొంటూ స‌ర‌దాగా గ‌డిపేస్తార‌ట‌. ఇంత సింప్లిసిటీ.. ఎంత‌మందికుంది??

తానెక్క‌డి నుంచి వ‌చ్చాడో ర‌జ‌నీకి బాగా తెలుసు. ప‌డిన క‌ష్టాలు తెలుసు. త‌గిలిన దెబ్బ‌లూ తెలుసు. అందుకే ఏ విజ‌యాన్నీ నెత్తిన ఎక్కించుకోలేదు. మ‌ళ్లీ మునుప‌టి జీవితం వ‌చ్చినా స్వీక‌రించే ధైర్యం ర‌జ‌నీకి ఉంది. ఆయ‌న మాట‌ల్లో, చేత‌ల్లో... ఈ విష‌యం స్ప‌ష్టంగా ధ్వ‌నిస్తుంటుంది. ఇంత సింపుల్ గా ఉండే సూప‌ర్ స్టార్ భార‌తీయ చ‌ల‌న చిత్ర‌సీమ చూసుండ‌దు. బ‌హుశా ర‌జ‌నీ లాంటి మ‌రో సూప‌ర్ స్టార్ పుట్టే ఛాన్సూ లేక‌పోవ‌చ్చు. అందుకే ర‌జ‌నీకాంత్ అంటే వ‌న్ అండ్ ఓన్లీ... సూప‌ర్ స్టార్‌.

(సంద‌ర్భం:  ఈరోజు ర‌జ‌నీకాంత్ పుట్టిన రోజు)


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS