సమరంలో ఎంతమంది ఉన్నా విజేత మాత్రం ఒక్కరే అవుతారు. అలా.. బరిలో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా వాటిని నెట్టుకుని 2019 సంక్రాంతి విజేతగా నిలిచింది ఎఫ్ 2. వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించబడిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 78 కోట్ల షేర్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం 80కోట్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు తీస్తోంది. ఇలాంటి టైంలో అమెజాన్.. నిర్మాత దిల్ రాజుకి మరియు తెలుగు పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది.
విడుదలకు ముందే నిర్మాత దిల్ రాజు 'ఎఫ్ 2' డిజిటల్ రైట్స్ ని అమెజాన్ కి అమ్మేసారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత ఎప్పుడైనా ప్రైమ్ లో అందుబాటులోకి రావచ్చు. దాంతో.. ఈ నెల 11నుండి 'ఎఫ్ 2' చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతుంది.
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు అంత మంచిగా లేకపోవటం వల్ల థియేటర్లలో 'ఎఫ్ 2' హడావిడి ఇంకొన్నిరోజులు కొనసాగే అవకాశం ఉంది. కానీ, అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఈ షాక్ తో 'ఎఫ్ 2' రికార్డులకు బ్రేక్ పడనుంది. సంవత్సరానికి రూ.1000 చెల్లిస్తే చాలు ప్రతీ సినిమాని ఇంట్లో కూర్చుని చూసే సదుపాయం అమెజాన్ కల్పిస్తుంది. రిలీజ్ అయిన ప్రతీ సినిమా ఇంత త్వరగా మొబైల్ లో అందుబాటులోకి వస్తుంటే ఇక థియేటర్స్ లో ఎవరు చూస్తారు అని ఇండస్ట్రీ ప్రముఖులు వాపోతున్నారు.
ఏదిఏమైనా.. ఇన్నిరోజులు సంక్రాంతి అల్లుళ్ళ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ని థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఆనందించనున్నారు.