ఏ సినిమాకైనా తొలి మూడు రోజుల వసూళ్లే కీలకంగా మారాయి. సినిమా హిట్టో, ఫట్లో ఆ మూడు రోజుల్లో తేలిపోతుంది. మూడు రోజుల వసూళ్లు బాగానే ఉన్నా.. వీక్ డేస్‌లో కుదైలేపోయి, మెల్లగా ఫ్లాప్ దారిలో నడిచే సినిమాలూ ఉంటాయి. కాబట్టి... `మండే టెస్ట్` అనేది కీలకంగా మారుతుంది. సోమవారం కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయంటే, ఆ సినిమా గట్టెక్కేసినట్టే. శుక్రవారం విడుదలైన ఎఫ్3 తొలి మూడు రోజులూ మంచి వసూళ్లే అందుకుంది. సోమవారం నుంచి ఈ సినిమా కలక్షన్లు ఎలా ఉంటాయి? అనేదానిపై ఆసక్తి నెలకొంది. సోమవారం కూడా స్ట్రాంగ్ గానే ఉంటే, ఈ సినిమా నిలబడిపోయినట్టు. లేదంటే... స్వల్ప నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు డిసైడ్ అయ్యాయి.
అయితే సోమవారం ఎఫ్ 3 కి మంచి వసూళ్లే దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.4 కోట్ల పైచిలుకు వసూళ్లు అందుకుంది. ఓ రకంగా ఇది మంచి మొత్తమే. 4 రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 39 కోట్లు అందుకొందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో రూ.5.5 కోట్లకు ఈ సినిమా అమ్మారు. ఇప్పటికే 5 కోట్లు వచ్చేశాయి. ఓవర్సీస్‌లో త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. నైజాంలో ఈ సినిమా రూ.14 కోట్లు దక్కించుకుంది. మిగిలిన చోట్ల.. కూడా రన్ బాగానే ఉంది. ఈ వారంలో `మేజర్`, `విక్రమ్` సినిమాలొస్తున్నాయి. ఆ సినిమాల ఫలితాల్ని బట్టి.. ఎఫ్ 3 ఫైనల్ రిపోర్ట్ ఆధారపడి ఉంటుంది.