గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కల్యాణ్ ఓడిపోయారు. గాజువాక, భీమవరం నుంచి అసెంబ్లీ స్థానం కోసం నిలబడిన పవన్‌కి ఓటమే ఎదురైంది. దాంతో.. పవన్ తో పాటు, పార్టీ శ్రేణులు అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఈసారి కూడా పవన్ ఓడిపోతే, రాజకీయంగా ఆ పార్టీకి భవిష్యత్తే ఉండదు. అందుకే పోటీ చేసే సీటు కోసం పవన్ చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు తిరుపతి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.
తిరుపతిలో కాపు ఓటింగ్ ఎక్కువ. బీజేపీకీ అక్కడ కాస్తో కూస్తో పలుకుబడి ఉంది. తన సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు లభిస్తుందన్న ఆశ పవన్ కల్యాణ్ లో పుష్కలంగా ఉంది. పైగా... అది అన్న చిరంజీవి గెలిచిన సీటు. ప్రజారాజ్యం తరపున పాలకొల్లు, తిరుపతిలలో చిరు పోటీ చేసిన సంగతి, పాలకొల్లులో ఓడిపోయి, తిరుపతిలో గెలిచిన సంగతీ తెలిసిందే. చిరుని నిలబెట్టిన చోటే... పవన్‌నీ నిలబెడితే ఫలితాలు బాగుంటాయని, పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సో.. ఈసారి పవన్ తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయం అనిపిస్తోంది.