ఎఫ్ 2తో సూపర్ హిట్టు కొట్టాడు అనిల్ రావిపూడి. కుటుంబ ప్రేక్షకుల్ని ఆ చిత్రం ఎంతగానో అలరించింది. దాంతో ఎఫ్ 3కి ద్వారాలు తెరచుకొన్నాయి. ఎఫ్ 2 అంతగా.. ఎఫ్ 3 నవ్వించలేదు గానీ, బాక్సాఫీసు దగ్గర మాత్రం మంచి ఫలితాన్ని అందుకొంది. ఎఫ్ 4 సైతం రాబోతోందని, ఎఫ్ 3లోనే చెప్పేశారు. దాంతో.. ఇప్పుడు అందరి దృష్టీ.. ఎఫ్ 4పై పడింది. అయితే.. ఈ సినిమా ఇప్పట్లో రాదు. కనీసం రెండేళ్లయినా సమయం పడుతుందని టాక్. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒప్పుకొన్నాడు. ఎఫ్ 4కి సమయం ఉందని, ఎఫ్ 4 తీయాలన్న ఆలోచన ఉన్నా, కార్య రూపం దాల్చడానికి ఇంకొంచెం సమయం కావాలని చెప్పుకొచ్చాడు రావిపూడి.
ఎఫ్ 3 తరవాత నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆ తరవాత.. దిల్ రాజు ప్రొడక్షన్‌లో మరో సినిమా చేయాల్సి ఉంటుంది. అది కూడా అయ్యాకే ఎఫ్ 4 ఉంటుందట. ``ఎఫ్ 4ని ఎప్పుడు పట్టాలెక్కిస్తానో ఇప్పుడే చెప్పలేను. కాకపోతే... తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ఎఫ్ 5, 6, 7... ఇలా తీస్తూనే ఉంటా. ఈ ఫ్రాంచైజీని జనం తిరస్కరించేవరకూ.. ఈ ప్రయాణం ఆగదు`` అని క్లారిటీ ఇచ్చాడు. ప్రతీ సీజన్‌కూ ఓ కొత్త హీరోని రంగంలోకి దింపే అవకాశం ఉందని రావిపూడి చెప్పడం విశేషం.