రాజమౌళి లెక్కలు పక్కగా వుంటాయి. అందుకే, కెరీర్‌లో ఇప్పటిదాకా హిట్లు మీద హిట్లు తప్ప.. పరాజయాల్ని చవిచూడలేదు ఈ దర్శక ధీరుడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీన సినిమాని విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రకటించగానే సోషల్ మీడియా వేదికగా, సినీ అభిమానులు ‘ఉచిత సలహాల ప్రక్రియ’ షురూ చేశారు. ఇంకో మూడు నెలలు ఆగి సంక్రాంతికి సినిమా విడుదల చేస్తే మంచిదన్న సలహాలు ఓ పక్క వినిపిస్తున్న వేళ, ఏకంగా కొందరు రాజమౌళికి సోషల్ మీడియా వేదికగా ‘డిమాండ్లు’ సంధిస్తుండడం గమనార్హం.
నిజానికి, 2020లోనే ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుుకు రావాల్సి వుంది. తొలుత ఎన్టీఆర్ గాయపడటం, ఆ తర్వాత చరణ్ గాయపడ్డంతో.. సినిమా ఆలస్యమయ్యింది. కరోనా దెబ్బకి ఆ ఆలస్యం ఇంకాస్త ఎక్కువయ్యింది. ఫ్లాప్ సినిమా అయినా, సంక్రాంతి సీజన్‌లో అదరగొట్టేస్తుంది గనుక, 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైతే, అదనపు అడ్వాంటేజ్.. అన్నది ఓ చర్చ. కానీ, రాజమౌళికి లెక్కలన్నీ పక్కగా తెలుసు. ఎప్పుడు తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో రాజమౌళికంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది.
రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు. తన సినిమా మార్కెటింగ్ గురించి కూడా ఆలోచిస్తాడు. అందుకే, రాజమౌళికి ఉచిత సలహాలు ఇవ్వాలనుకోవడం హాస్యాస్పదం.