తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే 'దిక్కు' అనే స్థాయిలో కొందరు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్‌ని రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల సమయంలో రాష్ట్రమంతటా పర్యటించి టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, ఆ తర్వాత జూనియర్‌ని పూర్తిగా పక్కన పెట్టేశారు చంద్రబాబు. టీడీపీలో నందమూరి కుటుంబానికి జరుగుతున్న అవమానం భరించలేక సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడారు.
ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కొడాలి నానికి సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ తాజా ఓటమి తర్వాత కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీని అప్పగించాలంటూ చంద్రబాబుని డిమాండ్ చేస్తుండడం గమనార్హం. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలా సినిమాల్లో నటించాలి, ప్రేక్షకుల్ని అలరించాలి.. అభిమానుల్ని ఉర్రూతలూగించాలి. సినిమాల్ని కాదనుకుని రాజకీయాల్లోకి వెళితే ఏమవుతుందో చాలా ఉదాహరణలు ఆయనకు కన్పిస్తున్నాయి. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని బాగు చేయడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.
మరోపక్క బాలకృష్ణ బేషజాల్ని పక్కన పెట్టి, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తెలుగుదేశం పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే మంచిదని టీడీపీలో కొందరు సీనియర్లు అంటున్నారట. అయితే బాలయ్య, చంద్రబాబుని కాదని ఏ పనీ చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీకి దరిదాపులకి చంద్రబాబు రానివ్వరు. అందుకే, టీడీపీకి ఇంకోసారి మద్దతిచ్చి తప్పు చేయొద్దని జూనియర్ ఎన్టీఆర్‌ని ఆయన అభిమానులు కోరుతున్నారు.