రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు? ఆయన పార్టీ ప్రకటన ఎప్పుడు? అన్నది తమిళ నాడు ప్రజలకు, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు ఎప్పుడూ మిస్టరీనే. దశాబ్ద కాలంగా ఇదే ప్రశ్న తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. అదిగో.. ఇదిగో అని ఊరించడం, ఆ తరవాత కామ్ అయిపోవడం రజనీకి కూడా అలవాటే. అయితే ఈసారి రజనీ రాజకీయ ప్రవేశం పక్కా అని రజనీ అభిమానులతో పాటు, తమిళనాట రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.
ఈ యేడాది కచ్చితంగా రజనీ పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తారని, కేడర్‌ని బలోపేతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు మొదలెడతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయదశమికి ఆయన పార్టీ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. అయితే ఈలోగా ఓ వర్గం రజనీని రాజకీయాల్లోకి రావదొద్దని వేడుకుంటోంది. కొంతమంది రజనీ అభిమానులు `ఈ కుళ్లు రాజకీయాల్లో మీరు దిగొద్దు` అంటూ వేడుకుంటున్నాయి. తమిళనాట సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు డిఎంకే పార్టీ నేతలు కూడా రజనీని రాజకీయాల్లోకి రావొద్దని కోరుకుంటున్నాయని భోగట్టా.
వయసు రీత్యా, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నాయట. అంతేకాదు... రజనీకి అత్యంత సన్నిహితుల్ని ఎంచుకుని.. రజనీ దగ్గరకు తమ దూతలుగా పంపుతున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది. దీనిపై డీఎంకే నేతలూ స్పందిస్తున్నారు.
రజనీ రాజకీయాల్లోకి రావడం వల్ల తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని చెబుతూనే, రజనీ రాజకీయాల్లోకి రావడం వల్ల పరిస్థితులు ఏమాత్రం మారవని ఎద్దేవా చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పటిలా మౌనంగా వింటూనే ఉన్నాడు రజనీకాంత్. మరి వీటిపై ఎప్పుడు స్పందిస్తాడో? ఎలాంటి సమాధానం చెబుతాడో?