గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను అభిమానించని సంగీతాభిమాని వుండరేమో.! ఆయన పాటల్లోని మాధుర్యం అలాంటిది. అయితే, కొత్త తరం గాయకుల రంగ ప్రవేశంతో ఎస్పీ బాలుని ఈ తరం సినీ ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారన్నది నిర్వివాదాంశం. అయినాసరే, బాలు ప్రత్యేకత ఏమాత్రం తగ్గలేదు. ఆయనకున్న ఫాలోయింగ్ అస్సలు తగ్గలేదని.. ‘ఎస్పీబాలసుహ్మ్రణ్యం’ పేరు ట్రెండింగ్‌లో వుండడం ద్వారా నిరూపితమవుతోంది.
నిజానికి, మన తెలుగు సినీ పాటల ప్రియులకంటే, తమిళ సినీ పాటల ప్రియులే ఎక్కువగా ఎస్పీ బాలుని గుర్తుపెట్టుకున్నారు. బాలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయినప్పటినుంచీ ఇప్పటిదాకా ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే వున్నారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని తెలిశాక, లక్షలాదిమంది బాలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన గాయకుడిపై తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. ఓ స్టార్ హీరోని మించి.. అనే స్థాయిలో ఎస్పీ బాలుకి అభిమానులు కనిపిస్తున్నారిప్పుడు.
‘నా పాటకు అభిమానులు తగ్గిపోతున్నారేమో..’ అని ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన మాట వాస్తవం. ఎందుకంటే, కొత్త తరం గాయకుల మోజులో పడి, ‘ఉచ్ఛారణ’కు విలువ తగ్గిపోతున్న పాటల వైపే సంగీత ప్రియులు మొగ్గు చూపుతున్న వేళ, ఆయన మాటల్లో వాస్తవం లేదని ఎలా అనగలం.? ఏదిఏమైనా, ఎస్పీ బాలు.. సినీ సంగీత ప్రపంచంలో ఓ శిఖరం. పాటగాడిగానే కాదు, నటుడిగా, సంగీత దర్శకుడిగా.. ఎస్పీ బాలు సినీ ప్రయాణం ఓ అద్భుతం.