ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ విషయంలో చాలా సందిగ్థం ఉంది. అక్టోబరు 13న విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా కారణంగా షూటింగులు వాయిదా పడిన నేపథ్యంలో.. ఈ సినిమా అక్టోబరు 13న రావడం అసాధ్యం. ఎందుకంటే.. మరో 30 శాతం షూటింగ్ ఇంకా బాకీ ఉంది. కరోనా వల్ల.. షూటింగులు ఆగిపోయినా. కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించేశారు నిర్మాతలు. అయితే ... ఆర్.ఆర్.ఆర్ విషయంలో అదేం జరగలేదు. ఇప్పటికీ అక్టోబరు 13నే విడుదల. అంటూ రాజమౌళి ఊరిస్తున్నాడు. ఆ రోజున ఈ సినిమా రాదన్నది అందరికీ తెలిసిన విషయమే.
అయితే కొత్త రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి ఓ నిర్ణయానికి రావాలని... బయ్యర్లు గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తారని కొందరు, వేసవికి తీసుకొస్తారని ఇంకొందరు.. అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తే మంచిది. ఎందుకంటే.. ఈ సినిమాపై బయ్యర్లు చాలా పెట్టుబడి పెట్టారు. ఆర్.ఆర్.ఆర్ విడుదల తేదీని బట్టే... మిగిలిన సినిమాలు ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటాయి. అందుకే ఈ విషయంలో రాజమౌళి ఓ స్పష్టతకు రావాల్సివుంది.