నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా సంగతులేంటి.? అన్న చర్చ కాస్త వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే, ఇదిప్పుడు కరోనా వైరస్ కాలం. ఈ లాక్ డౌన్ ఎత్తేసేవరకూ సినీ విషయాల మీద జనానికి కూడా అంత ఆసక్తి వుండదేమో. ఆ సంగతి పక్కన పెడితే, ‘బి ద రియల్ మేన్’ ఛాలెంజ్ విషయంలో బాలయ్య స్పందన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన బాబాయ్ బాలయ్యకి అబ్బాయ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన సవాల్ ఇది.
బాలయ్యకే కాదు, మెగాస్టార్ చిరంజీవికీ, అక్కినేని నాగార్జునకీ, విక్టరీ వెంకటేష్‌కీ సవాల్ విసిరాడు యంగ్ టైగర్. చిత్రమేంటంటే ఆ నలుగురూ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ అగ్రహీరోలు. చిరంజీవి ఇప్పటికే యంగ్ టైగర్ సవాల్‌ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జున ఈ విషయంలో ఎప్పుడూ ముందే వుంటారు.. వెంకటేష్ సంగతి సరే సరి. బాలయ్య మాత్రం సోషల్ మీడియాలో లేరు. ఇప్పుడు వున్నపళంగా ఓ వీడియో రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో బాలయ్య విడుదల చేస్తారా.? లేదా.? అన్న విషయమై నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
బేషజాలు పక్కన పెట్టి, సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని చాటి చెప్పడానికి ఇదో అద్భుతమైన సందర్భం సినీ జనాలకి. నిజానికి, ఇలాంటి ఏ సందర్భం వచ్చినా దాన్ని సినీ పరిశ్రమ సద్వినియోగం చేసుకుంటూనే వుంటుంది. బాలయ్య నుంచి కూడా ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ వీడియో వచ్చేయడానికే అవకాశాలెక్కువ.