సినీ పరిశ్రమకి సంబంధించి, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారంటే, ఆ వ్యక్తిని సినీ పరిశ్రమలో ఉన్నవారు సపోర్ట్ చేయడానికి కొన్ని అభ్యంతరాలుంటాయి. పార్టీలకతీతం అనే భావన ఒక వైపు. ఎవరిని సపోర్ట్ చేస్తే, ఇంకెవరైనా నొచ్చుకుంటారేమోనని అనుకుంటుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ విషయంలో ఈ అభ్యంతరాలు పెద్దగా లేవు. చిరంజీవి దగ్గరకు వచ్చేసరికి, చాలా అభ్యంతరాల్ని సినీ ప్రముఖులు ఫేస్ చేశారు.
పవన్ కళ్యాణ్ విషయంలో ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది పరిస్థితి. ఓపెన్‌గా పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో మద్దతు ఇస్తున్న సినీ ప్రముఖులు తక్కువే అయినా, పరోక్షంగా మద్దతు ఇస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసిన వారు, పని చేయని వారు, ఆయన మీద తమ అభిమానాన్ని ఏదో ఒక రకంగా చాటుకుంటూనే ఉన్నారు. రాజకీయ రంగంలో పవన్ అత్యున్నత శిఖారాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, చాలా మంది సెలబ్రిటీలు నిన్న పవన్ కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పారు.
దాంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 'అందరివాడు' అయిపోయాడు. ఇప్పటికైతే పవన్‌కి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ మారే అవకాశం లేకపోలేదు. ఇంతలా పవన్‌కి మద్దతు పెరగడం వెనక ఆయన వ్యక్తిత్వమే కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.