హీరో శ్రీకాంత్ అంటేనే చాలా కూల్ గా ఎప్పుడు అందరితో నవ్వుతూ పలకరించేవాడిగానే మనకు తెలుసు. అట్లాంటిది ఆయన ఈరోజు జరిగిన మా ప్రెస్ మీట్ లో ఒకింత అసహనానికి గురయ్యారు.
అసలేం జరిగిందంటే- ‘మా’ అసోసియేషన్ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ప్రముఖ హీరోలందరి చేత వివిద దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించి నున్నారు. తద్వారా వచ్చిన డబ్బుతో ‘మా‘ అసోసియేషన్ సొంత భవనాన్ని నిర్మించాలనుకుంటున్నట్టుగా తెలిపారు.
మొన్నీమధ్యనే అమెరికాలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకెళ్ళి వచ్చినందుకు రూ 1 కోటి రూపాయలు వచ్చినట్టుగా మా కార్యవర్గం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ డబ్బు వ్యవహారంలోనే అవకతవకలు జరిగాయి అంటూ మా జనరల్ సెక్రటరీ అయిన నరేష్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని సమాచారం.
దీనికి సంబంధించి మా కార్యవర్గం రెండు రోజుల క్రితం సమావేశమై చర్చించడం కూడా జరిగింది. ఇక ఇదే అంశమై ఈరోజు ‘మా’ పెట్టిన ప్రెస్ మీట్ కి నరేష్ రాకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మీట్ లో పాల్గొన్న శ్రీకాంత్ ని ఆర్ధిక అవకతవకల గురించి ప్రశ్నించగా అసలు అలాంటివి జరగడానికి ఆస్కారమే లేదని, తనకి కార్యవర్గ సభ్యుల మీద పూర్తి నమ్మకముంది అని చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై నిన్న నరేష్ తో తాను దాదాపు 45నిమిషాల పాటు మాట్లాడాను అని చెబుతూ ఆయనని ఈరోజు ప్రెస్ మీట్ కి రమ్మంటే రాలేదు అని చెప్పాడు. చివరగా ‘మా’ కార్యవర్గం ఎలాంటి ఆర్ధిక అవకతవకలకైనా పాల్పడితే తను ఇక జీవితంలో ‘మా’ సభ్యత్వం తీసుకొను అని ఒకవేళ ఈ ఆరోపణలు తప్పని రుజువైతే ఆరోపణలు చేసినవారు ఈ సవాలుని స్వీకరిస్తారా అని ఎదురు ప్రశ్నించాడు.
మొత్తంగా ‘మా’ అధ్యక్షుడు అయిన శివాజీరాజాకి జనరల్ సెక్రటరీ అయిన నరేష్ కి మధ్య తలెత్తిన వివాదాల ఫలితమే ఈ గొడవ అని తెలుస్తున్నది.