రామోజీరావు: క‌థ‌నీ, క‌ళ‌నీ న‌మ్మిన నిర్మాత‌!

మరిన్ని వార్తలు

ఈ ఉషాకిర‌ణాలూ..
తిమిర సంహ‌ర‌ణాలు..
చైత‌న్య దీపాలు.. మౌన ప్ర‌బోధాలు.. జ‌గ‌తికి ప్రాణాలు.. ప్ర‌గ‌తి ర‌థ చ‌క్రాలూ...


అంటూ ఓ సినిమా మొద‌లైందంటే చాలు. అది ఉషాకిర‌ణ్ మూవీస్ సినిమా అని చెప్పేయొచ్చు. ఈ గీతానికి త‌గ్గ‌ట్టుగానే ఆయా సినిమా ప్రమాణాలు ఉండేవి. క‌ళ‌కూ, క‌థ‌కూ పెద్ద పీట వేసిన సంస్థ ఉషాకిర‌ణ్ మూవీస్. దాదాపు వంద చిత్రాలు నిర్మించి - చ‌ల‌న చిత్ర నిర్మాణ రంంలో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొంది. ఈ సంస్థ వెనుకా, ముందూ ఉన్న వ్య‌క్తి, వ్య‌వ‌స్థ‌... రామోజీరావు.


సినిమా అంటే రామోజీరావుకు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఆ ప్రేమ‌తోనే 'ఈనాడు'లో సినిమాకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన పేజీ కేటాయించారు. అప్ప‌ట్లో దిన ప‌త్రిక‌లు సినిమాని చాలా చిన్న చూపు చూసేవి. 'ఈనాడు'లో సినిమా వార్త‌ల‌కు అగ్ర తాంబూలం ఇవ్వ‌డం ద‌గ్గ‌ర్నుంచి మిగిలిన ప‌త్రిక‌లూ 'ఈనాడు'ని ఫాలో అవ్వాల్సివ‌చ్చింది. 'శ్రీ‌వారికి ప్రేమ‌లేఖ‌' సినిమాతో ఉషాకిర‌ణ్ మూవీస్ ప్ర‌భంజ‌నం మొద‌లైంది. అక్క‌డ్నుంచి అన్నీ సంచ‌ల‌నాలే. 'ప్ర‌తిఘ‌ట‌న‌', 'మయూరి', 'పీపుల్స్ ఎన్‌కౌంట‌ర్‌'లాంటి చిత్రాలు ఉషాకిర‌ణ్ మూవీస్ ప్ర‌తిష్ట‌కు అద్దం ప‌డ‌తాయి. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం... ఓ సంచ‌ల‌నం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టూడియోగా ఆర్‌.ఎఫ్‌.సీ అవ‌త‌రించింది. నిర్మాత‌కు కావాల్సిన అన్ని స‌దుపాయాలూ ఫిల్మ్‌సిటీలో ఉన్నాయి. ఓ నిర్మాత క్యాష్ బాక్స్‌తో స్టూడియోలోకి అడుగుపెడితే, ఫ‌స్ట్ కాపీతో బ‌య‌ట‌కు వెళ్లొచ్చు అన్న ధీమా ఫిల్మ్‌సిటీ క‌ల్పించింది. 


సితార.. సినీ వార్తా ప‌త్రిక‌ల్లో చిర‌కీర్తిని సంపాదించుకొంది. దాదాపు 3 ద‌శాబ్దాల పాటు సితార సినిమా కుటుంబంలో ఓ భాగ‌మైపోయింది. గాసిప్పుల‌కు పెద్ద పీట వేసే కాలంలోనూ సితార త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకొంటూ నాణ్య‌మైన సినిమా వార్త‌ల్ని, విశ్లేష‌ణ‌ల‌ను అందించింది. సితార‌ పేరుతో వ‌రుస‌గా మూడేళ్లు చిత్ర‌సీమ‌కు అవార్డులు అందించారు. అయితే ఉషాకిర‌ణ్ మూవీస్ స్థాపించ‌డంతో అవార్డుల కార్య‌క్ర‌మానికి అంత‌రాయం క‌లిగింది. చేతిలో ఫిల్మ్‌సిటీ ఉంది, ఈనాడు ఉంది అని ఉషాకిర‌ణ్ ఎప్పుడూ ఎడా పెడా సినిమాలు తీయ‌లేదు. త‌మ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్న క‌థ‌లు వ‌చ్చిన‌ప్పుడే చిత్ర నిర్మాణం గురించి ఆలోచించింది. లేదంటే ఈపాటికి క‌నీసం 200 సినిమాలు తెర‌కెక్కించేవారు. కాల‌క్ర‌మంలో... ఉషాకిర‌ణ్ మూవీస్ లో చిత్ర నిర్మాణం త‌గ్గిపోయింది. ఇప్పుడు ఈటీవీ విన్‌ పేరుతో ఓటీటీ సంస్థ ఏర్పాటైంది. త్వ‌ర‌లో మ‌రో పెద్ద ఓటీటీ సంస్థ‌కు అంకురార్ప‌ణ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది ఈనాడు. వీట‌న్నింటి వెనుక ఉన్న మూల విరాట్‌... రామోజీ రావునే. ఆయ‌న లేని లోటు చిత్ర‌సీమ‌కే కాదు, తెలుగు జాతికే పెద్ద లోటు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS