లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. దాంతో స్టూడియోలు బోసిబోయాయి. ఇప్పుడు వాటికి కొత్త సమస్య ఏర్పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టూడియోల్ని ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని, వాటిని క్వారెంటైన్ కేంద్రాలుగా మార్చాలన్న ఆలోచనలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న స్టూడియోలు కొన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం.
నగరం నడిబొడ్డున ఉన్న స్టూడియోలు క్వారెంటైన్ కేంద్రాలకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం గ్రహించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాటిని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని, క్వారెంటైన్ కేంద్రాలుగా వాడుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. సినీ స్టూడియోలు కొన్ని ప్రభుత్వ రాయితీలతో కట్టినవి. ఎకరాలకు ఎకరాలు చవగ్గా రాసిచ్చేసినవీ ఉన్నాయి. ఓరకంగా అవన్నీ ప్రభుత్వాల ఆస్తులే. ప్రభుత్వం అడిగితే.. ఇవ్వాల్సిన బాధ్యత స్టూడియో అధినేతలకు ఉంది. పైగా ఇప్పుడు సినిమాలకు సంబంధించిన వ్యవహారాలేం స్టూడియోలలో జరగడం లేదు.
ఈ పరిస్థితి గ్రహించే విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోని తాత్కాలిక క్వారెంటైన్ సెంటర్లుగా మార్చడానికి సురేష్ బాబునే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ లోని స్టూడియోల్నీ అలానే మార్చే ఆలోచన ఉంది. ప్రభుత్వాలు ముందుకొచ్చి, తీసుకుంటే.. తిరిగి ఎప్పుడు ఇస్తారో చెప్పలేని పరిస్థితి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం లాక్కోక ముందే.. స్టూడియోల్ని స్వచ్ఛందంగా క్వారెంటైన్ కేంద్రాలుగా మార్చేయడానికి ఇచ్చేస్తే బాగుంటుందేమో...?