ఇంట్లో కూర్చుని సినిమా చూసేసే అవకాశం ఓటీటీ కల్పిస్తోంది. కరోనా నేపథ్యంలో ఓటీటీ తప్ప ఇంకో దారి లేకపోవడంతో, కొన్ని సినిమాలు ఓటీటీని నమ్ముకున్నాయి. దురదృష్టవశాత్తూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఓటీటీ మీద ‘హిట్టు’ అనిపించుకోలేకపోయింది.
సినిమాని థియేటర్లలో చూస్తే వచ్చే కిక్కు.. ఓటీటీలో చూస్తే ఎలా వస్తుంది.? సినిమాపై అంచనాలు క్రియేట్ అవ్వాలి. దానికోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరగాలి.. ప్రెస్‌మీట్లు వుండాలి.. ఇంత హంగామా నడిస్తే, ఒకవేళ సినిమాలో కంటెంట్ లేకపోయినా.. ఓపెనింగ్స్ బావుంటాయి. ఆ తర్వాత టైమ్ బావుంటే, ఓ మోస్తరు కంటెంట్‌తో వచ్చిన సినిమా కూడా హిట్టయిపోతుంది. అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్ళు తెరుచుకోనున్న దరిమిలా, మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా క్రమంగా.. థియేటర్లకు జనం వెళ్ళడానికి అలవాటుపడతారనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది.
తాజాగా విడుదలైన రెండు ఓటీటీ సినిమాలూ ప్రేక్షకుల్ని నిరాశపర్చినట్లే కనిపిస్తోంది. ‘వీటినే సినిమా థియేటర్ లో చూస్తే ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుందేమో..’ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయా సినిమాల్ని ఓటీటీల్లో చూసేసినవాళ్ళు. హీరోయిన్ అనుష్క చెప్పినట్లు, థియేటర్లలో ఆ సౌండ్.. ఆ మూడ్.. ఓటీటీలో రావడం కష్టమే. సినిమా టిక్కెట్ల కోసం కష్టపడాలి.. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి.. ఇదంతా బోల్డంత హంగామా. అది కదా అసలు కిక్కు అంటే. ఆ కిక్కు లభించాలంటే ఇంకొన్నాళ్ళు తప్పదు. కానీ, సినిమా అంటే ఆ మాత్రం కిక్కు వుండి తీరాల్సిందే.