ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసినా, ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకుంటానే తప్ప, వెనుదిరిగేది లేదంటున్న జనసేనాని ముందు ఎప్పటిలాగే మళ్లీ అదే ప్రశ్న. సినిమాల్లో నటించాలని. ఆయన మాత్రం తన జీవితం పూర్తిగా రాజకీయాలకే అంకితమంటున్నారు. కానీ, అభిమానులు మాత్రం ఆయన్ని సినిమాల్లో కూడా హీరోగా చూడాలనుకుంటున్నారు. ఆయన సినీ గ్లామర్ రాజకీయాల్లో వృధా కాలేదు. యూత్ అంతా ఆయన వెంటే ఉంది. కానీ, అది సరిపోదు. మరింత చైతన్యం కావాలి.
స్వచ్ఛమైన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కలగాలి. ఆ అవగాహన కల్గించే దిశగా జనసేనాని వడివడిగా అడుగులు కదుపుతున్నారు. ఈ ప్రయాణంలో అక్కడక్కడా జనసేనానికి తగులుతున్న ప్రశ్న సినిమాల్లో రీ ఎంట్రీ ఎప్పుడు.? అని. కానీ జనసేనాని నుండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. రాజకీయ సమీక్షల్లోనే మునిగి తేలుతున్నారాయన. అయితే, తాజా సమాచారమ్ ప్రకారం సమీక్షలు ఓ కొలిక్కి వచ్చాక కార్యకర్తలకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. జనసేన కార్యకర్తల అభిప్రాయం కూడా అదే. పవన్ సినిమాల్లో నటించడం పార్టీకి ప్లస్సే అవుతుంది.
కానీ, మైనస్ ఎంత మాత్రమూ కాదు అని వారు భావిస్తున్నారట. అంతేకాదు, ఆయన సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బును పార్టీ డెవలప్‌మెంట్ కోసం వినియోగించవచ్చనే సలహాలు కూడా ఇస్తున్నారట. ఇటు సినిమాలనూ, అటు రాజకీయాలనూ మ్యానేజ్ చేయగల సత్తా పవన్ కళ్యాణ్‌కి ఉందని ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి పబ్లిగ్గా కన్‌ఫామ్ చేశారు. పవన్ ఓకే అంటే ఈ క్షణం ఆయనతో సినిమాలు తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. ఇక పవన్ నిర్ణయమే తరువాయి.