జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో బిజీ అయిన కారణంగా నవ్వుల నవాబు నాగబాబు బుల్లితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. ఈటీవీలో నవ్వుల ప్రోగ్రామ్ అయిన 'జబర్దస్త్'కి జడ్జ్‌గా నాగబాబు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వారంలో రెండు రోజులు బుల్లితెర ప్రేక్షకుల్ని ఆహ్లాదంగా ఆనందంగా నవ్వుకునేలా చేస్తూ, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోంది ఈ షో. అయితే, ఈ మధ్య రాజకీయ పార్టీ కార్యకలాపాల కారణంగా ఈ షోకి తాత్కాలికంగా దూరమయ్యారు నాగబాబు. నాగబాబు స్థానంలో కొన్ని రోజులు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, మీనా, సంఘవి తదితరులు తాత్కాలిక జడ్జ్‌లుగా వ్యవహరించారు.
ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్‌కి అలీ కూడా జడ్జ్‌గా వ్యవహరించారు. ఆలీ రాకతో నాగబాబు 'జబర్దస్త్'కి గుడ్‌బై చెప్పేశారేమో అనే అనుమానం కలిగింది. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ నాగబాబు 'జబర్దస్త్'షోలో ప్రత్యక్షమయ్యారు. జబర్దస్త్ షోకి నాగబాబు, రోజా రెండు కళ్ల వంటి వారు. వారిద్దరూ లేకుండా ఎంతమంది వచ్చినా ఆ షో కళావిహీనంగానే ఉంటుంది. ఎప్పటి నుండో నాగబాబు చెబుతూనే వస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా, తాను జబర్దస్త్ వదలనని. కానీ, ఈ మధ్య జరిగిన పరిణామాల దృష్ట్యా బుల్లితెర ప్రేక్షకులు అలా భావించాల్సి వచ్చింది. ఏది ఏమైతేనేం నాగబాబు తిరిగొచ్చేశారు. 'జబర్దస్త్'కి అసలు సిసలు కళ తెచ్చేశారు. అదీ సంగతి.