ఈ శుక్రవారం నాని సినిమా 'గ్యాంగ్ లీడర్' వస్తోంది. ఈ సినిమాతో పాటు 'వాల్మీకి' కూడా రిలీజ్ కావల్సింది. అయితే నిర్మాతలిద్దరూ ఓ అభిప్రాయానికి రావడం వల్ల 'వాల్మీకి' వారం రోజులు వెనక్కి వెళ్లింది. 'గ్యాంగ్ లీడర్'ది పూర్తిగా సోలో రిలీజ్ అనుకున్నారంతా. అయితే... శ్రీకాంత్ సినిమా `మార్షల్` ఈ గ్యాంగ్ లీడర్‌తో పోటీ పడబోతోంది. మరి ఈ రెండు సినిమాల టాక్ ఏమిటి? రెండు సినిమాలున్నా - అందరి కళ్లూ 'గ్యాంగ్ లీడర్'పైనే అన్నది నిర్వివాద అంశం.
నాని హీరో. అందునా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. వరుస హిట్ల మైత్రీ మూవీస్ నిర్మించింది. కార్తికేయని విలన్‌గా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు బాగా క్లిక్ అయ్యాయి. ఇలా ఈ సినిమాకి అన్నీ ప్లస్ పాయింట్సే. బిజినెస్‌కూడా ఓ రేంజులో సాగింది. రేపు ఓపెనింగ్స్ కూడా అదిరిపోవడం ఖాయం. ఈ సినిమాకి ఇప్పటికే పాజిటీవ్ టాక్ నడుస్తోంది. ఫస్ట్ ఆఫ్‌లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని, సెకండాఫ్ మొత్తం రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే... సెకండాఫ్ కాస్త డల్ అయ్యిందట. క్లైమాక్స్ ట్విస్టు మాత్రం అదిరిపోయేలా ఉంటుందని సమాచారం. మొత్తానికి నాని ఈ సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకునే ఛాన్సులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సెకండాఫ్ బాగా డామేజ్ చేస్తే తప్ప - 'గ్యాంగ్ లీడర్' బ్యాండ్ బజాయించడం ఖాయం. ఇక శ్రీకాంత్ సినిమా 'మార్షల్' గురించి చెప్పుకోవాలి. గ్యాంగ్ లీడర్‌తో పోటీ పడేంత బలం.. ఈ సినిమాకి లేదు. పైగా ఈమధ్య శ్రీకాంత్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ లేకుండా పోయింది. కాకపోతే ట్రైలర్ ఆకట్టుకుంది. కథ, కథనాల్లో వైవిధ్యం కనిపిస్తోంది. ఇందులో శ్రీకాంత్ నెగిటీవ్ రోల్ పోషిస్తున్నాడు. ఈమధ్య చిన్న సినిమాలు సైలెంట్‌గా హిట్ కొట్టేస్తున్నాయి. మార్షల్‌కీ బాక్సాఫీసు దగ్గర నిలబడే సత్తా ఉంది. కాకపోతే.. గ్యాంగ్ లీడర్‌ని ఏమాత్రం తట్టుకుంటుందన్నది ప్రశ్నార్థకం.