చిరు - పవన్ మధ్య ఎప్పుడూ... అడ్డు గోడలే. ప్రజా రాజ్యం సమయంలో చిరు, పవన్ ల మధ్య విబేధాలు తలెత్తాయని చెప్పుకున్నారు. ఆ తరవాత.. అవి ఏదోలా సద్దుమణిగాయి. పవన్ `జనసేన` స్థాపించినా చిరు ఇటువైపుకు రాలేదు. ఓ దశలో చిరు జనసేనలో చేరతారని కూడా వార్తలొచ్చాయి. కానీ.. చిరుకి రాజకీయాలపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లడంతో - ఆయన జనసేన వైపుకు అడుగులు వేయలేదు. కాకపోతే... తమ్ముడితో సఖ్యతగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్యా అనుబంధం మరింత బలంగానే కనిపించింది. అయితే తాజాగా టికెట్ రేట్ల వ్యవహారంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి.
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి చిరుని ఇబ్బంది పెట్టాయని సమాచారం. పవన్ వ్యాఖ్యల వల్ల అప్పటి వరకూ చిత్రసీమ కోసం తను చేసిన ప్రయత్నాలు నీరుగారి పోయాయని వ్యక్తిగతంగా చిరు భావిస్తున్నార్ట. ఈ విషయమై... పవన్ తో సీరియస్ గా ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఏపీ మంత్రులకు ఫోన్ చేసి పవన్ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని పేర్ని నానినే చెప్పుకొచ్చారు. పవన్ కి సపోర్ట్ గా... చిరు ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. రిపబ్లిక్ వేడుకలో పవన్ చిరుకి సైతం కౌంటర్ ఇచ్చారు. మెతకగా ఉండొద్దని, చిత్రసీమ గురించి పోరాడాలని అన్నకు సూచనలు ఇచ్చారు. కనీసం వీటిపైనైనా చిరు స్పందించాలి కదా? అది కూడా జరగలేదు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది. మరి ఇదెంత కాలమో..?