ఆర్.ఆర్.ఆర్ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే.. మీడియా నుంచి ఎవ్వరికీ ఆహ్వానాలు అందలేదు. చిత్రబృందం.. కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో క్లాప్ కొట్టేశారు చిరంజీవి.
రాజమౌళి సినిమా అనేసరికి మీడియాని దూరం పెట్టడం ఇదేం కొత్త కాదు. `బాహుబలి` ఆడియో ఫంక్షన్‌కి మీడియాని ఆహ్వానించలేదు. అతి తక్కువ పాస్‌లు ఇచ్చి.. చేతులు దులుపుకున్నారు. ఆడియో వేదిక దగ్గరా.. మీడియాకు ఎక్కడో దూరంగా విసిరేసినట్టు సీట్లు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా మీడియా అంతటినీ ఒకేలా చూడలేదు. జాతీయ ఛానళ్లను, మీడియాని మాత్రం తన సెట్‌కి పిలిపించుకుని ఇంటర్వ్యూలు ఇచ్చిన రాజమౌళి - తెలుగు వాళ్లని ఆమడదూరం పెట్టాడు.
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీశామని చెప్పుకుంటూ.. తెలుగు మీడియాని చిన్నచూపు చూడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక యాడ్లంటారా? సరే సరి. అయితే.. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బాహుబలికి ఫ్రీగా పబ్లిసిటీ చేసి పెట్టింది. అంతర్జాతీయ స్థాయి సినిమా అంటూ రివ్యూలు ఇచ్చింది.
ఇప్పుడూ అంతే. తన కొత్త సినిమా ఓపెనింగ్ కి మీడియాను దూరం పెట్టాడు రాజమౌళి. పత్రికలు, ఛానళ్లు లేకుండానే ఆయన సినిమా ఓపెనింగ్ జరిగిపోయింది. మీడియాని పిలిచినా, పిలవకున్నా - దానికి సంబంధించిన కవరేజీ పుష్కలంగా వచ్చేస్తుంది. అందులో అనుమానాలేం లేవు. కాకపోతే... కనీస గౌరవం కోసమైనా మీడియాని ఆహ్వానించాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.చరణ్, ఎన్టీఆర్ కలసి సినిమా చేస్తున్నారంటే.. అది కచ్చితంగా ఆసక్తిగొలిపే అంశమే. తెలుగు సినిమా పరిశ్రమ టర్నింగ్ పాయింట్‌కి ఇలాంటి మల్టీస్టారర్‌లు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుకు సైతం మీడియా అవసరం లేదనుకున్నాడేమో రాజమౌళి. అందుకే వాళ్లని దూరంగా ఉంచాడు. మరి బాహుబలి సమయంలో లైట్‌గా తీసుకున్న మీడియా జనాలు.. ఈసారీ అదే పంథా పాటిస్తారా? `ఏం చేసినా మన రాజమౌళినే కదా...` అంటూ లైట్ తీసుకుంటారా?? చూడాలి మరి.