ఇలియానాపై చాలా పుకార్లు వినిపించాయి ఆ మధ్య. ఆండ్రూతో సహజీవనం చేస్తున్న ఇలియానా... తనని సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుందని, తను ఇప్పుడు గర్భవతి అని చెప్పుకున్నారు. ఈమధ్య ఇలియానా బొద్దుగా మారడం చూసి `అదంతా నిజమే` అనుకున్నారు కూడా. వీటిపై ఇలియానా స్పందించింది.
తన గురించి మీడియా, ప్రజలు రకరకాలుగా అనుకోవడం తనకు తెలుసునని, తనపై చాలా పుకార్లు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చింది. తను గర్భవతి అని కూడా ప్రచారం జరుగుతోందని, అయితే ఇవేం నిజాలు కావని అంటోంది. తనకంటూ వ్యక్తిగత జీవితం ఉందని, దాన్ని పదే పదే బయటపెట్టడం ఇష్టం లేదని, తనకెప్పుడు ఏమనిపించింది ఇన్‌స్ట్రాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూనే ఉన్నానని చెప్పింది.
ఆండ్రూతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడడానికి నిరాకరించిన ఇలియానా `మేం హ్యాపీగా ఉన్నాం. అంతకంటే ఏం కావాలి` అంటూ ఒక్క మాటలో తేల్చేసింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కొన్ని అవకాశాలు కూడా వచ్చాయని, అయితే దేనికీ ఓకే చెప్పలేదని అంటోంది ఇలియానా.
సో... ఈ గోవా బ్యూటీ తెలుగులో తన ఇన్నింగ్స్‌ని కంటిన్యూ చేస్తుందన్నమాట.