ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తోందంటే ఆ హడావుడి మామూలుగా ఉండేది కాదు. నెల రోజుల ముందే.. ఆ సందడి మొదలైపోయేది. సినిమా ఎలా ఉండబోతోంది? చిరు ఎలాంటి పాటలకు స్టెప్పులు వేయబోతున్నాడు? ఫైట్లెన్ని.. ? ఇలా చాలా విషయాలపై హాట్ హాట్ చర్చ జరిగేది. దానికి తోడు... చిత్రబృందం కూడా భారీగా పబ్లిసిటీ చేసేది. కానీ `గాడ్ ఫాదర్` విషయంలో ఇవేం జరగడం లేదు.
మలయాళ సినిమా `లూసీఫర్`ని చిరంజీవి `గాడ్ ఫాదర్` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 5 దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ప్రమోషన్లే మొదలెట్టలేదు. ఓ టీజర్, పాట వదిలారు. కానీ కిక్కు లేదు. ఆ పాటగానీ, టీజర్ గానీ ట్రెండింగ్‌లోకే వెళ్లలేదు. ఏం చేస్తే ఈ సినిమాకి బజ్ వస్తుందో తెలీక దర్శక నిర్మాతలు తలలు పట్టుకొంటున్నారు. చిరంజీవి సినిమాకి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇదే తొలిసారి.
ఆచార్య ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ పై పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. అందుకే గాడ్ ఫాదర్‌ని కామ్ గా విడుదల చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అలాగైనా జనాలైనా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కదా.? అది కూడా జరగడం లేదు. ఈ సినిమాని ఎలాంటి అంచనాలూ లేకుండా సైలెంట్ గా విడుదల చేస్తే.. సినిమా ఏమాత్రం బాగున్నా ఆడేస్తుందన్నది నిర్మాత ప్లాన్ కావొచ్చు. కానీ ఇది చిరు సినిమా. దానికి బజ్ లేకపోవడం ఏమిటో అభిమానులకు సైతం అర్థం కావడం లేదు.