విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టాడు. అలాంటిలాంటి హిట్ కాదిది. బంపర్ హిట్. ఎందుకంటే ఈ సినిమా రెండో రోజుకే లాభాల బాట పట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్లు షేర్ కొల్లగొట్టిన 'గీత గోవిందం' రెండో రోజు, మూడో రోజు అదే జోరు కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని చోట్లా అన్ని షోస్ హౌస్‌ఫుల్స్ నమోదవుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల విషయానికి వస్తే, అక్కడ కూడా 'గీత గోవిందం' అంచనాలకు మించి వసూళ్లను రాబడుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కేరళలో వరదల కారణంగా కొన్ని చోట్ల సినిమా ప్రదర్శన జరగడం లేదు. ప్రదర్శితమవుతున్న చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. కేరళలో వచ్చిన వసూళ్లను అక్కడి వరద బాధితులకే అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాస్ ప్రకటించడం మలయాళ సినీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. ఆనందంలో ముంచెత్తింది.
సోదర రాష్ట్రం తమ కష్టాన్ని గుర్తించినందుకు మలయాళ గడ్డకు చెందినవారు, తెలుగు నేలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. సినిమా రిలీజ్‌కి ముందు విజయ్ దేవరకొండ కేరళ వరద బాధితుల కోసం 5 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళ వరదలకు సంబంధించి, తెలుగు సినీ పరిశ్రమ నుండి ఇలా స్పందించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనొక్కడే.
విజయ్ దేవరకొండ బాటలో పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించి మలయాళ సోదరుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఇలా ముందుకొచ్చిన వారిలో తమిళ సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.