టాలీవుడ్‌లో ఇప్పుడు ముద్దుగుమ్మ రష్మికా మండన్నా పేరు మార్మోగిపోతోంది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం 'గీత గోవిందం' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరుతో ఫుల్ స్వింగ్‌లో ఉంది.
ఇక ఈ సినిమాలో 'గీత' పాత్ర పోషించిన ముద్దుగుమ్మ రష్మికా తన పాత్ర గురించి చెప్పుకుంటూ, ఈ పాత్ర పోషించేందుకు తాను చాలా కష్టపడ్డానని చెబుతోంది. ఎందుకంటే సినిమాలో ఎక్కువగా కోపంగా కనిపించే రష్మికకు రియల్ లైఫ్‌లో అస్సలు కోపమే రాదట. అలాంటిది సినిమా మొత్తం కోపంగా కనిపించడమంటే కత్తి మీద సామే అయ్యిందంటోంది.
తాను కోపంగా కనిపించినా, చూసిన ప్రేక్షకులకు అది వినోదంగానే కనిపించాలి. ఇలాంటి ఫీల్ క్రియేట్ చేయడమంటే కొంచెం కష్టమే కదా. అందులోనూ తనకి నచ్చని ఫీలింగ్ అది. అదే కోపం అనే ఫీలింగ్. ఎట్టకేలకు సినిమా విజయవంతమైంది. దాంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేవు. సెట్స్‌లో ఎంత కోపంగా కనిపించిందో సెట్స్ నుండి బయటికొచ్చాక అంతకుమించిన జోష్‌తో కనిపించేదట రష్మికా.
ఇదిలా ఉంటే, త్వరలోనే 'దేవదాస్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మికా. నాగ్, నాని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో రష్మికా, నానికి జంటగా నటిస్తోంది.