ఓవర్సీస్‌లో 'గీత గోవిందం' దూకుడుకు అడ్డు కట్టే లేకుండా పోయింది. తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, మూడు రోజులు గడిచే సరికి 5 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. మంగళవారం ప్రీమియర్ షోలు, బుధ, గురు వారాల కలెక్షన్ ఈ లెక్కల్లో ఉండగా, ఈ రోజు వన్ మిలియన్ దాటేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అక్కడి ట్రేడ్ పండితుల అంచనా.
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఇంత తక్కువ టైంలో ఇంత బిగ్గెస్ట్ వసూళ్లు సాధించింది 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా ఇద్దరికీ ఈ విజయం చెప్పుకోదగ్గదే. ఓవర్సీస్‌లో 'గీత గోవిందం' పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాతో ఇక విజయ్‌కి ఓవర్సీస్‌లో తిరుగు లేదని నిరూపించేసుకున్నాడు. విజయ్ నుండి రాబోయే సినిమాలకు ఈ సినిమాతో ఇప్పటి నుండే పిచ్చ క్రేజ్ ఏర్పడింది.
త్వరలోనే 'డియర్ కామ్రేడ్' చిత్రం విడుదల కానుంది. రష్మికానే ఈ సినిమాలో కూడా హీరోయిన్. అంతకు ముందే విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' విడుదల కావాల్సి ఉంది. 'గీత గోవిందం' తెచ్చిన క్రేజ్‌తో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోయింది. మూడో సినిమాతోనే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి విజయ్ దేవరకొండ చేరిపోయాడంటే, అదంత ఆషామాషీ విషయం కాదు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు.