నందమూరి నట వారసుడు, బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం విషయంలో గత కొంత కాలంగా సందిగ్థం నెలకొంది. తొందరపడి హడావిడిగా మోక్షజ్ఞ తెరంగేట్రం ఉండకూడదనీ, ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలన్నది బాలయ్య ఆలోచన.
అయితే ఆ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏంటా? అంటే బాలయ్య వందో చిత్రం అనుకున్నారంతా. ఆ చిత్రం ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అని అభిమానులంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు బాలయ్య నుండి వస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'ఎన్టీఆర్' బయోపిక్. ఈ చిత్రంతో ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని మరోసారి అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానులే కాదు, ఫిల్మ్ నగర్ టాక్ కూడా అదే.
ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా, బాలయ్య పాత్రను మోక్షజ్ఞ పోషిస్తాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి 'ఎన్టీఆర్' బయోపిక్ సరైనదేనా? క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని బాలయ్య గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబోలు. బాలయ్యతో నూరవ చిత్రాన్ని తెరకెకించిన క్రిష్‌కి అప్పుడు ఆ అవకాశం దక్కలేదు. 'ఎన్టీఆర్' బయోపిక్ ఎట్నుంచి ఎటో తిరిగి మళ్లీ అనూహ్యంగా క్రిష్ చేతికి చిక్కింది. ఈ సారైనా వెండితెరపై తమ అభిమాన నటుడి వారసున్ని చూడాలన్న నందమూరి అభిమానుల కోరిక తీరుతుందో లేదో చూడాలిక.
ఇకపోతే ఈ సినిమాతో పలువురు సీనియర్, జూనియర్ నటీనటులు ఒకే తెరపై కనిపించనున్నారు. అందుకు సంబంధించి పలువురు పేర్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించగా, మరికొంత మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది.