ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు 'జార్జిరెడ్డి' జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'జార్జిరెడ్డి'. ఈ సినిమాకి ఎందుకో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. నిజానికి జార్జిరెడ్డి అనే వ్యక్తి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన వ్యక్తి. కానీ, తెలిసిన ఆ తక్కువ మంది నుండీ కొంత పోజిటివ్, కొంత నెగిటివ్ రెస్పాన్స్ రావడం, నెగిటివ్ రెస్పాన్సే ఎక్కువగా రావడంతో, సినిమా లో ఏముంది.? అసలెవరీ జార్జిరెడ్డి.? అంటూ గూగుల్ సెర్స్ చేసిన వారు కొందరైతే, పలు టీవీ ఛానెల్స్‌లో వచ్చిన జార్జిరెడ్డి జీవితానికి సంబంధించి డిస్కషన్స్‌ని ఫాలో అయిన వారు ఇంకొందరున్నారు.
అన్నింటికీ మించి, అఖిల భారత విద్యార్ది పరిషత్తు నుండి ఈ సినిమా రిలీజ్‌పై వచ్చిన అభ్యంతరాల వివాదం సినిమా పబ్లిసిటీకి బాగా కలిసొచ్చింది. పవన్ కళ్యాణ్ ఇన్‌ఫ్లూయెన్స్ సినిమాపై ఉండడం, రియల్‌గానే పవన్ కళ్యాణ్ సినిమాకి మద్దతు తెలపడం, చిరంజీవి చేతుల మీదుగా సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేయడం, సినిమా పట్ల పోజిటివ్‌గా చిరంజీవి స్పందించడం.. అన్నీ వెరసి 'జార్జిరెడ్డి'పై అంచనాలు పెంచేసింది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివాదాల కారణంగా సెన్సార్ పనులు లేటయినా, ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ సెన్సార్ పనులు పూర్తి చేసి, 'యు/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో రిలీజ్‌కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. పెరిగిన హైప్ కారణంగా, టాక్‌తో సంబంధం లేకుండా, 'జార్జిరెడ్డి'కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.